జీవో అంటే ప్రభుత్వ ఆదేశం. ఎంత పక్కాగా అమలయితే ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉంటుంది. కానీ ఏపీలో జగన్ రెడ్డి సర్కార్ జీవోలకు అసలు విలువే లేదు. ఎవరూ నమ్మరు. ఎవరో కాదు.. సొంత ప్రభుత్వంలోని వాళ్లే నమ్మరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జీవోలిచ్చారా.. సరేలే అనుకునే పరిస్థితి. ఇంత నమ్మశక్యం కాని పాలన చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు సిద్ధం అంటూ రెడీ అయిపోయారు.
జీవోలకు పనులు కావు !
ఎన్నికల్లో గెలిచి అట్టహాసంగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ రెడ్డి మొదటి కేబినెట్ సమావేశంలో కొన్ని వందల నిర్ణయాలు తీసుకున్నారు. చాలా జీవోలొచ్చాయి. కానీ అవన్నీ ఉత్తుత్తి జీవోలుగా మిగిలిపోయాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ అదే ట్రెండ్. అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలుపై జీవో ఇచ్చారు. కానీ డబ్బులు రావు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలపై చర్చలు జరిపి జీవోలిచ్చారు. కానీ ఆ జీవోల్లో ఉన్నది అమలు లేదు. కొన్ని వేల పనులు.. ఆదేశాలు ఇలా జీవోలకే పరిమితమయ్యాయి. ఏమన్నా అడిగితే జీవో ఇచ్చమంటారు.. దాంతో ఆ పని కావాల్సిన వాళ్లు సైలెంట్ కావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి చేస్తే జీవో అమలయినట్లు లేకపోతే లేదు. జీవో గురించి ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదని అందరూ ఓ నమ్మకానికి వచ్చారు.
జీవోలు ఇచ్చామని పనులు చేసేసినట్లుగా ప్రచారం
ప్రభుత్వ విధానం ఒక్కటే.. జీవో ఇచ్చేసి హామీ నెరవేర్చేశామని చెప్పుకోవడం. అది ఏదైనా అంతే. ప్రజలకు సంబంధించిన అంశంలో అయినా డిమాండ్ వినిపిస్తే ఇదిగో జీవో జారీ చేశామని ప్రచారం చేసుకుంటారు. సమస్య పరిష్కారం అయిదంటారు. కానీ పరిష్కారం మాత్రం అక్కడే ఉంటుంది. ఎన్నో జీవోలు ఇలాంటివి ఉన్నాయి . చాలా మంది జీవోలిచ్చినా పనులు కాలేదని.. డబ్బులు ఇవ్వలేదని.. కోర్టులకు వెళ్తే… అక్కడా ఇదే పరిస్థితి. జీవో ఇచ్చామని ప్రాసెస్ లో ఉందని చెబుతున్నారు.
సొంత అవసరాలు మాత్రం జీవోల్లేకుండానే పూర్తి !
అయితే ఇది అన్నింటికీ కాదు. రుషికొండ ప్యాలెస్ ముఫ్పై మూడేళ్లకు ఎవరికైనా లీజుకు ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేస్తారు. తర్వాత తీరిగ్గా జీవో ఇస్తారు. అది కూడా రహస్యంగా ఉంచుతారు. భూములు తాకట్టు పెట్టాలన్నా కార్పొరేషన్ల నుంచి రుణాలను తీసుకు రావాలన్నా… చివరికి ప్రత్యర్థుల ఆస్తులను వివాదాల్లోకి తేవాలన్నా జీవోల కన్నా వేగంగా పనులవుతాయి… తర్వాత జీవోలు విడుదలవుతాయి. ఇదీ పరిపాలన…!