జగన్ రెడ్డి ఏపీ ఎన్నికలను రావణకాష్టం చేసేందుకు రెడీ అయ్యారు. యుద్ధానికి సిద్ధం, చొక్కాలు మడతపెడతాం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. ఇప్పటికే రౌడీమూకల్ని ఇళ్ల మీదకు పంపి కావాల్సినంతగా భయపెట్టిన జగన్… వాలంటీర్లు, కార్యకర్తలు ఇక పూర్తిగా రెచ్చిపోవాలని పిలుపునిస్తున్నారు.
ఎలా గెలవాలో దువ్వాడ శ్రీనివాస్ ఆడియో ద్వారా పార్టీ నేతలకు సందేశం
ఎలా గెలవాలో దువ్వాడ శ్రీనివాస్ అనే ఆకురౌడీ లీడర్ ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త సందేశం పంపారు కూడా. దువ్వాడకు చెందిన ఓ ఆడియో వైరల్ అయింది. అందులో స్థానిక ఎన్నికల్లో తాము ఎలా గెలిచామో పూసగుచ్చినట్లుగా వివరించారు. అచ్చెన్నాయుడు స్వగ్రామంలో దాడులు చేసి.. రివర్స్ లో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి.. నియోజకవర్గం అంతా భయానక వాతవరణం ఏర్పాటు చేశారు. తర్వాత టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థులపై రౌఢీషీట్లు ఓపెన్ చేసి.. ఇంట్లో నిర్బంధించి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకున్నారు. ఫలితంగా 55 పంచాయతీలే వస్తాయని తేలిన చోట… ఓ పది ఇరవై తప్ప అన్ని పంచాయతీలను.. జడ్పీటీసీలను గెల్చుకున్నారు. అంటే భయపెట్టి.. పోలీసుల్ని దుర్వినియోగం చేసి ఎన్నికలు నిర్వహించారు. ఇదే పద్దతిని రాష్ట్రమంతా అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలన్నది వైసీపీ వ్యూహం. అందుకే ఈ ఆడియో టేపును వైరల్ చేశారు.
తిరుపతి ఉపఎన్నికలు జరిగిన తీరు కళ్ల ముందే
వచ్చే ఎన్నికలు చాలా హింసాత్మకంగా ఉంటాయని చాలా మంది రెండేళ్లుగా అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. తితిరుపతి ఉపఎన్నికలు నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడంతో అన్ని వివరాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల నకిలీ ఓట్లతో ఎన్నికలు నిర్వహించారు. అధికార పార్టీ, నేతలు ప్రోద్భలంతో జరిగినవే ఇవన్నీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకపక్షంగా గెలిచే చోట కూడా ఇంత భారీగా అక్రమాలకు పాల్పడటం అంటే.. చిన్న విషయం కాదు.
పోలీసులు కాదు వైసీపీ నేతలే !
ఏపీలో పోలీసు వ్యవస్థ వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎన్నికల్లో టీడీపీని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కుట్రలు అమలు చేశారు. అంగళ్లులో చంద్రబాబు పర్యటన విషయంలో ఏం జరిగిదో అందరూ చూసినా టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు.అదీ కూడా వందల మందిపై కేసులు పెట్టారు. తాజాగా ఆ కేసుల్ని చూపించి పుంగనూరు నియోజకవర్గంలో వంద మందికిపైగా రౌడీషీట్లు తెరిచినట్లుగా చెబుతున్నారు. ఒక్క చోట కాదు.. టీడీపీ క్యాడర్‌పై కనీసం పాతిక వేల కేసులు పెట్టారని.. ఎన్నికల్లో వారిని బైండోవర్ చేయడానికి లేదా.. ఏజెంట్లుగా కూర్చోకుండా చేయడానికేనని అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ ఎఫ్ఐఆర్లు చాలా వరకూ బయటకు రాలేదు.
అయితే పులివెందుల ప్లాన్ ను రాష్ట్రమంతా అమలు చేయాలనుకుంటే… ప్రత్యర్థులు కూడా రెడీ అవుతారు. చొక్కాలు మడత పెడితే కుర్చీలు మడతేస్తారు. జరగబోయేది అదే.