సినిమా ప్రమోషన్స్ లో లిరికల్ వీడియో కోసం విజువల్స్ చేయడానికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్, సమయం కేటాయిస్తుంటారు. వీటి కోసం గ్రాఫిక్స్, డిజైనింగ్ కంపెనీలు బాగానే డిమాండ్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఏఐ, చాట్ జీపీటీ పనితీరు ఆశ్చర్యపరుస్తుంది. వీటి సాయంతో అద్భుతాలు చేస్తున్నారు కొందరు. సినిమా పరిశ్రమలో కూడా వీటి వాడకం పెరుగుతోంది. మొన్న నాని ‘హాయ్ నాన్న’ సినిమా కోసం ఓ ఫారిన్ ఫీమేల్ వాయిస్ ని ఏఐలోనే సృస్టించాడు సంగీత దర్శకుడు హేషం. ఇటివలే రజనీకాంత్ లాల్ సలాంలో బాంబా బక్యా, షాహుల్ హమీద్‌ల వాయిస్‌లను రీ-క్రియేట్ చేశాడు రెహమన్. ఇప్పుడు టాలీవుడ్ లో ‘ఏఐ’ సాయంతో ఒక లిరికల్ వీడియోని రూపొందించారు. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన సినిమా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్’అనే పాటని ఎంఎం కీరవాణి రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ ఇచ్చారు. శివుని నేపధ్యంలో సాగే పాట ఇది. లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ ‘ఏఐ’తో జనరేట్ చేశారు. విజువల్స్ క్యాలిటీగానే వున్నాయి. చిన్న సినిమాలు బడ్జెట్ కి భయపడి అసలు ఇలాంటి లిరికల్ వీడియోల జోలికి వెళ్ళవు. అలాంటి వారికి ‘ఏఐ’తో కొత్తదారి దొరికినట్లయింది. అయితే ఏఐ లో అవుట్ పుట్ రాబట్టుకోవడానికి కూడా శ్రమపడాలి. తమ కంటెంట్ సరిపడే కమాండ్ లు ఇవ్వగలగాలి. అప్పుడే సరిపడా విజువల్స్ జనరేట్ అవుతాయి. ఏదేమైనా టెక్నాలజీ సరిగ్గా వాడుకోవాలే కానీ మంచి ప్రయోజనాలు పొందవచ్చు.