తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి పొత్తుల కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేసిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ హైకమాండ్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ప్రతిపాదనలపై అంతర్గత చర్చ కూడా జరిగిందని చెబుతున్నారు. కానీ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉందని ఆ పార్టీకి మనం ఊపిరి పోయాల్సిన పని లేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడంతో చివరికి పొత్తుల ప్రచారాన్ని ఖండించేశారు.
తెలంగాణలో పొత్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి నిర్మోహమాటంగా ఖండించారు. కేసీఆర్ ను కల్వకుంట్ల కరప్షన్ రావు గా అభివర్ణించడంతో … ఆయన అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నేరుగా చెప్పినట్లయింది. ఈ పరిణామంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా ప్రజల్లోకి వెళ్తోంది. వచ్చే నెల రోజుల్లో ఇలాంటి మూమెంట్ పెరిగితే… బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుంది.
నిజానికి బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రణాళిక వేసుతుందని చెబుతారు. కానీ బీజేపీ పొత్తులకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రెండు రకాలుగా టెన్షన్ తప్పినట్లే అనుకోవచ్చు. పార్లమెంట్లో మెజార్టీ సీట్లు గెల్చుకోవచ్చు… అలా గెల్చుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని పటిష్టంగా నడుపుకోవచ్చు.