ఏపి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు సుశీల్ పోలీస్ కేసు వ్యవహారంపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈరోజు ఉదయం రావెలను తన కార్యాలయానికి పిలిపించుకొని గట్టిగా మందలించారు. ఆయన కొడుకు చేసిన నిర్వాకం వలన ప్రభుత్వానికి, పార్టీకి చాలా చెడ్డపేరు వస్తుంటే, రావెల తన కొడుకుని వెనకేసుకొనివస్తూ మాట్లాడిన మాటల వలన ఇంకా చెడ్డపేరు వస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. మిగిలిన మంత్రులు, తెదేపా నేతలు కూడా రావెల కిశోర్ బాబు, ఆయన కొడుకు సుశీల్ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటుకి నోటు కేసు కారణంగా తెలంగాణాలో తలెత్తుకొని తిరుగలేకపోతుంటే, ఇప్పుడు ఈ కేసు, రావెల మీడియా ముందు మాట్లాడిన మాటలు తెదేపాకు చాలా ఇబ్బందికరంగా మారాయి. పైగా ఇప్పుడు శాసనసభ సమావేశాలు కూడా మొదలయ్యాయి. తెదేపా ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని వాదిస్తూ ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్న ఈ తరుణంలో ఈ వ్యవహారం బయటపడటం, దానిపై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నిందించడంతో తెదేపా సభ్యులు సభలో వైకాపా ముందు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి కల్పించారు రావెల. ఇప్పుడు ఈ వ్యవహారంలో మంత్రి రావెల తన కొడుకుని జైలు నుండి విడిపించుకొని, ఈ కేసు నుండి బయటపడేందుకు తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు చేసుకొన్నా, ఇకపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవచ్చును.