జర్నలిస్టుపై దాడి ఘటనపై అనంతపురం పోలీసులు ఇప్పటి వరకూ కేసులు నమోదు చేయలేదు. హత్యాయత్నం చేసినా పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు. జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినా కనీసం స్పందించలేదు. చర్యలు తీసుకుంటామని మొక్కుబడి ప్రకటన చేశారు. కానీ.. మీడియానే అసలు ఎవరు దాడి చేశారో కూడా ఆధారాలతో సహా ప్రచురించింది. కానీ పోలీసులకు మాత్రం కనిపించలేదు.
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి ప్రణాళిక ప్రకారం జరిగింది. ఉద్దేశపూర్వంగా కొట్టారు. తమ గురించి వ్యతిరేకంగా రాస్తే.. చంపేస్తామని హెచ్చరికల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి. జగన్ రెడ్డి చొక్కా మడత పెట్టాలని ఇచ్చిన పిలుపు వెనుక ఉన్నది ఇదే. జగన్ రెడ్డి సర్వీస్ బ్యాచ్ అధికారులు మాత్రం నేరస్తులకే కొమ్ము కాస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఖాకీ డ్రెస్‌కు అవమానాలు తెస్తున్నారు.
ఉరవకొండలోనూ జర్నలిస్టులపై దాడి జరిగింది. అక్కడా పోలీసులది అదే నిర్లిప్తత. తీవ్ర విమర్శలు వచ్చాక.. ఎవరో పదిహేను మందిని అరెస్టు చేశామని చెప్పుకొచ్చారు. పోలీసుల వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇలాంటి వారితో ఎన్నికలు నిర్వహించడం అంటే… ఇక అరాచక రాజ్యంలో నేరస్తులకు ప్రజల్ని వదిలేసినట్లేనని అనుకోవచ్చు. ఈ నేరంలో అసలు తప్పు పోలీసులదే. ఏం చేసినా చర్యలు ఉండవన్న నేరస్తుల ధైర్యం కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.