మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డితో విబేధించారంటే ఎవరూ నమ్మలేదు. ఆయన పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించినప్పుడు కూడా ఎవరూ నమ్మలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాత్రం కొంత మంది నిజనేమో అనుకున్నారు. కానీ ఎక్కువ మంది.. ఆర్కే ఓ ప్రత్యేమైన మిషన్ మీద ఉన్నారని అనుకున్నారు.
షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారని తెలిసినప్పటి నుండి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నట్లుగా లీకులు ఇచ్చారు. చివరికి షర్మిల ఏపీలోకి వస్తారని తెలియగానే వైసీపీకి రాజీనామా ప్రకటించి.. షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. షర్మిల ఏపీలో అడుగు పెట్టినప్పటి నుండి ఆమె వెంటే ఉండాలని ప్రయత్నించారు. ప్రతీ విషయంలో ఆమె ప్రతినిధిగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో షర్మిలపై సాక్షి మీడియాలో ఓ ప్రణాళికాబద్దమైన దాడి జరిగింది. పాదయాత్ర గురించి.. ఢిల్లీ పర్యటనల గురించి.. ఆమెపై తెలంగాణలో షర్మిల పార్టీలో పని చేసిన వారు ఆరోపణలు ప్రారంభించారు. వీరి వెనుక ఆర్కే ఉన్నారని షర్మిల గుర్తించడంతో.. ఇక పూర్తిగా పక్కన పెట్టారని అంటన్నారు.
ఆ తర్వాత ఎక్కడికక్కడ ఆర్కే జోక్యాన్ని కట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ వ్యహాలపై కూడా ఆర్కేకు ఎలాంటి సమాచారం లేకుండా చేశారని అంటున్నారు. ఈ పరిణామాలతో దీంతో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని అర్థం కావడంతో.. మరోసారి ఆయనను తన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బుజ్జగించారని .. అందుకే వైసీపీలో చేరారని ప్రచారం చేసుకుని.. వచ్చి పార్టీలో చేరిపోయారు. ఆయన కోవర్ట్ ఆపరేషన్ కు.. రాజీనామానే సాక్ష్యం. గంటా రాజీనామాను ఆమోదించిన స్పీకర్ ఆళ్ల రాజీనామాను మాత్రం పట్టించుకోలేదు.
మొత్తంగా వైసీపీ నుంచి కొంత మందిని కాంగ్రెస్ లోకి పంపి.. మళ్లీ కీలకమైన సమయంలో అందరూ వెనక్కి వచ్చేలా చేసి.. అసలు కాంగ్రెస్ ను ఎవరూ నమ్మరని చెప్పేలా ఓ కుట్ర చేశారన్న అనుమానాలు ఆర్కేను చూసిన వారికి వస్తన్నాయి.