జగన్ రెడ్డి పథకాల పేరుతో చేసే విన్యాసాల్లో నిజంగా ప్రజలకు ఎంత చేరుతుందో నిజం ఎవరికీ తెలియదు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతారు. నిజమైన బటన్ అయితే.. ఇలా నొక్కగానే అలా అకౌంట్లలో పడిపోవాలి. కానీ ఆయన ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడరు. కాస్త కూడా తెలివైన వాళ్లు అనుకోరు. తాను బటన్ నొక్కేస్తే డబ్బులు అకౌంట్లలో పడిపోతాయని పడకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్ అనుకుంటారని ఆయన నమ్మకం. ఈ విషయం పక్కన పెడితే… లబ్దిదారుల ఖాతాల్లో ఈ బటన్ నొక్కుడు వల్ల డబ్బులు పడతాయో లేదో కానీ.. జగన్ రెడ్డి ఖాతాలో మాత్రం పడిపోతాయి. ఎందుకంటే మొట్టమొదటి లబ్దిదారు ఆయనే. ఒక్కో సారి పథకం కోసం విడుదల చేసే మొత్తం కన్నా ఆయన ఖాతాలోనే ఎక్కువ పడతాయి.
రూ. 10 కోట్ల నిధులు విడుదల చేయడానికి రూ. 50 కోట్లతో ప్రకటనలు
జగన్ రెడ్డి అమలు చేసే పథకాలు.. నియోజకవర్గానికి వంద నుంచి వెయ్యిమందిలోపే ఉంటాయి. కల్యాణమస్తు వంటి పథకాలకు అయితే నియోజకవర్గానికి ఐదారు మంది కూడా ఉండవు. విదేశీ విద్యాదీవెన వంటి పథకాలకు.. లబ్దిదారులు 175 మంది కూడా లేరు. ఇలాంటి పథకాలకు కూడా కోట్లు పెట్టి పత్రికా ప్రకటనలు ఇస్తూంటారు. ఇటీవల ఎడెక్స్ తో ఒప్పందం అంటూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. రూ. పది వేలు రుణానికి వడ్డీ కడుతున్నామంటూ అదే చేశారు. ఇక్కడ నిజంగా… బటన్లు నొక్కేది.. నాలుగైదు కోట్లకే ఆ పేరుతో ప్రకటనలకు యాభై కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నారు.
అధికారికంగా ప్రజాధనం జగన్ రెడ్డి ఖాతాలోకే !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నప్రతీ పథకానికి మొదటి లబ్దిదారులు సీఎంజగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియానే. మీటలు నొక్కడానికి ముందే ఆ పత్రికకుపెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తారు. రూ. కోట్లు వెదజల్లుతారు. అధికారికంగా డబ్బులు దోచుకునే విధానం ఎలా ఉంటుందంటే.. అసలు పథకం ప్రకటించడానికి కూడా.. ప్రకటనలు జారీ చేస్తారు. . కల్యాణముస్తు, షాదీ తోఫా పథకం వెబ్సైట్ను ప్రారంభించిన వెంటనే… రూ. కోట్లు పెట్టి ఫుల్ పేజీయాడ్స్ ఇచ్చారు. బటన్ నొక్కే సమయంలోనూ యాడ్స్ ఇస్తారు. మొత్తంగా లబ్దిదారులకు ఇచ్చిన దాని కన్నా ఆ పేరుతో పేపర్ కు అంటే జగన్ రెడ్డి ఖాతాకు పంపిన ప్రజాధనమే ఎక్కువ అవుతుంది.
ఇది క్విడ్ ప్రో కో కాదు.. నేరుగా దోపిడీ !
ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. .అలాగే ఆ ప్రకటనలు ఎలా ఉండాలో కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన రూలింగ్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కోర్టుల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టును పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవలే కోర్టు స్పందించింది. నోటీసులు జారీ చేసింది. కానీ చేయాల్సిన తప్పు చేశారు. దోచుకోవాల్సింది దోచుకున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించి ఏం ప్రయోజనం ఉంటుందో చెప్పలేం. నిజానికి జగన్ రెడ్డి అంటే క్విడ్ ప్రో కో బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని అంటారు. ఇది క్విడ్ ప్రో కో కాదు.. నేరుగా ప్రజాధనాన్ని తన ఖాతాల్లోకి పంపడం. నిబంధనల ప్రకారం సాక్షి దినపత్రి సర్క్యూలేషన్ లో ఎక్కువగా లేదు. ఏ విధంగా చూసినా సాక్షికి అన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ ఇస్తున్నారు. పథకాల పేరుతో ప్రజలకు రూపాయి.. పంచి..ప్రకటనల పేరుతో రూ. వంద నొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఈ కారణంగానే వస్తున్నాయి.