ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ వెనక్కి తెచ్చుకోవడంతో .. వైసీపీ నేతలు పార్టీనీ ఛీ కొట్టి వెళ్లిన వారంతా వెనక్కి వస్తారని ఫేక్ ప్రచారం ప్రారంభించుకున్నారు. విజయసాయిరెడ్డి .. లావు కృష్ణదేవరాయులుతో టచ్ లోకి వెళ్లారని గుంటూరు పార్లమెంట్ సీటుపై చర్చిస్తున్నారని వాట్సాప్ లో ఫేక్ ప్రచారం స్టార్ట్ చేయడంతో కృష్ణదేవరాయులు ఘాటుగానే స్పందించారు. ఆయన స్పందన చూసి వైసీపీ పరువు పోయినట్లయింది. లావు మాత్రమే కాదు.. జగన్ రెడ్డిని ఛీ కొట్టి వెళ్లిపోయిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ముందు ముందు చాలా ఉంటుందని చెబుతున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ ప్లాన్ ప్రకారమే వెళ్లారు. తిరిగి వచ్చారని అందరికీ తెలుసు. ఆయనకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది అంతర్గతంగా ఏదో ఒప్పందం చేసుకుని ఉంటారు. కానీ మిగతా వాళ్లు అలా కాదు. వాళ్లను బానిసలుగా చూశారు. తాము టిక్కెట్ ఇవ్వకపోతే గాలికిపోతారన్నట్లుగా చూశారు. చివరికి వారంతా గుడ్ బై చెప్పడంతో ఇప్పుడు వారితో చర్చలు జరుపుతున్నామంటూ కొత్త ప్రచారాలు ప్రారంభించారు. పార్టీలో ఉన్నప్పుడు సరిగ్గా వ్యవహరించడం చేత కాదు కానీ.. బయటకు వెళ్లిపోయాక బుజ్జగింపులు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ దుస్థితిని అద్దం పడుతోందంటున్నారు.
వైసీపీ పరిస్థితి దారుణంగా మారిందని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సర్వేలే కాదు.. క్షేత్ర స్థాయికి వెళ్లిన ఎవరికైనా పరిస్థితి అర్థమైపోతుంది. వైసీపీ క్యాడర్ లో కనీస ఉత్సాహం లేదు. వైసీపీ ఓటర్లలో మళ్లీ గెలిపించుకోవాలన్న ఉత్సాహం లేదు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గురించి చెప్పాల్సిన పని లేదు. వేరే పార్టీ వాళ్లు చేరడానికి చర్చలు జరుపుతున్నామని చెప్పుకోవడం కాస్త గౌరవం గా ఉంటుంది కానీ ఛీ కొట్టి వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ రావాలని చర్చలు జరుపుతున్నామని ప్రచారం చేసుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది వైసీపీ నేతలకు అర్థం కావడంలేదు.