జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ రకరకాల విశ్లేషణలు వస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ క్లారిటీగానే ఉన్నారు. ఆయన ఈ రోజు భీమవరం పర్యటనకు వెళ్లి టీడీపీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. తాను పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేయబోతున్నానని.. పూర్తి స్థాయిలో సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులను కలిశారు. అలాగే బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ ఇంటికి కూడా వెళ్లారు. పోటీ చేస్తున్నందున ఇలా వారి వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం సంప్రదాయం కాబట్టి పవన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. పవన్ భీమవరంలో పోటీ ఖరారు కావడంతో జనసేనలో సందడి ప్రారంభమయింది.
ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమి క్లీన్ స్వీప్ టార్గెట్ గా పెట్టుకుంది. ఒక్క సీటు కూడా వైసీపీకి పోనివ్వకూడదన్న లక్ష్యంతో ఉన్నారు. ఈ క్రమంలో పవన్ భీమవరం నుంచే పోటీ చేయాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. భీమవరంలో ఈ సారి క్షత్రియవర్గం నుంచి వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉంది.