ఏపీలో టీడీపీ, జనసేనతో కలవాలని బీజేపీని బతిమాలానని.. ఎన్నో చీవాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు. దీంతో అసలు పొత్తులు, సీట్ సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాకపోవడానికి ఆయనే కారణం అని తేలిపోయింది. బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. బీజేపీ కూడా ఆసక్తి చూపలేదు. కానీ పవనే ప్రయత్నించారు.
బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని.. గతంలో.. జనసేన నేత పోతిన మహేష్ నేరుగానే విమర్శలు చేశారు. చాలా మంది అభిప్రాయం ఇదే. అసలు బీజేపీతో కలవడం కన్నా సొంతంగా పోటీ చేస్తేనే ఎక్కువ ఓటు షేర్ వస్తుందని జనసైనికులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ రెడీగా లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎన్నికల వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకుండా రక్షణ కోసమే బీజేపీతో పొత్తులు అన్నట్లుగా కవర్ చేసుకుంటున్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేని స్థితికి ప్రజాస్వామ్యం చేరితే… ఇక దేశానికి రక్షణ ఎక్కడ ఉంటుంది ? . అదే నిజమైతే అలాంటి పరిస్థితి తెచ్చిన బీజేపీపై పోరాడాల్సి ఉంటుంది.
పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు కోసం బతిమాలడం ద్వారా ఆయన తన పార్టీ విలువను తగ్గించుకున్నట్లు అవుతుంది. సీట్ల కేటాయింపులో బీజేపీ కోసం ఆయనే త్యాగం చేయాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సన పని లేదు. ఇతర కారణాలతో గెలిచే సీట్లను బీజేపీకి ఇచ్చి వైసీపీకి మేలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం రెడీగా లేరు. జనసేనకు కూడా పూర్తిగా గెలుపు ప్రాతిపదికనే టిక్కెట్లు కేటాయిస్తున్నారని చెబుతున్నారు. అయితే తెర వెనుక విషయాలను పవన్ చెప్పుకోవాల్సన అవసరం లేదన్న కామెంట్లు మాత్రం ఎక్కువ వినిపిస్తున్నాయి.