అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి లాంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన రధన్ పై ఓ యువ దర్శఖుడు ఫైర్ అయ్యాడు. ‘చెన్నైలో ఉండి బతికిపోయాడు’ అంటూ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిప్పులు చెరిగాడు. తనవల్ల సినిమాలు కిల్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే… రేపు విడుదల అవుతున్న ‘సిద్దార్థ్ రాయ్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకి రధన్ సంగీతం అందించాడు. అయితే అవుట్ పుట్ విషయంలో రధన్ తనని బాగా విసిగించాడని, తనతో చాలా విషయాల్లో అర్గ్యుమెంట్లు నడిచాయని, తను మంచి టెక్నీషియన్ అయితే అవ్వుండొచ్చు కానీ, తన సినిమాకి పాటలు, రీరికార్డింగ్ అందించే విషయంలో తనని మానసికంగా హింసించాడని, చెన్నైలో ఉండి బతికిపోయాడని, హైదరాబాద్ లో ఉంటే చాలా గొడవలు అయ్యేవని, అలాంటి సంగీత దర్శకులతో దూరంగా ఉండాలని ఈ చిత్ర దర్శకుడు యశస్వీ మీడియా ముందే ఆవేదన వెళ్లగక్కాడు.
రధన్ పై ఇలాంటి విమర్శలు రావడం కొత్తేం కాదు. ‘అర్జున్ రెడ్డి’ సమయంలోనూ ఇదే జరిగింది. రధన్ ప్రవర్తన, తన కమిట్ మెంట్ పై అప్పుడే సందీప్ రెడ్డి వంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. రధన్ మంచి టెక్నీషియన్. తన మెలోడీ బాగుంటుంది. నేపథ్య సంగీతం కూడా కొత్తగా వినిపిస్తుంది. కానీ అనుకొన్న సమయానికి అవుట్ పుట్ ఇవ్వడు. రకరకాల కారణాలతో, దర్శకుల్ని, నిర్మాతల్ని బాగా విసిగిస్తాడని చాలామంది చెబుతుంటారు. అందుకే.. ప్రతిభ ఉన్నా, సరైన అవకాశాలు అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ కంప్లైంట్ మరోసారి డీటీఎస్ సౌండ్ ఎఫెక్టుతో వినిపించాడు ఈ కొత్త దర్శకుడు.