పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మొత్తంగా రేసులో నలుగురు ఉన్నారు. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేనే. ఆయన పార్టీలోనే ఉండి ఉంటే ఆయనకే టిక్కెట్ ఖరారు చేసేవారు. కానీ వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో జనసేన కొత్త అభ్యర్థిని పోటీకి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీకి మంచి బలం ఉన్న నియోజకవర్గం అయిన రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీని చూసుకుంటున్నారు. 2014లో గొల్లపల్లి సూర్యారావు గెలిచారు. జనసేన 2019లో జనసేన గెలిచిన స్థానం కావడంతో టీడీపీ ఆశలు వదులుకుంది. గొల్లపల్లి సూర్యారావు తన కుమార్తె అమూల్యను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయమని కూటమి నేతలకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం నుండి మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటుదన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.
అయితే గొల్లపల్లి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే.. నియోజకవర్గం టీడీపీకి ఇచ్చినట్లేనని జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నియోజకవర్గ నుంచి మరో ముగ్గురు జనసేన నేతలు పోటీ పడుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో చింతలమోరి గ్రామ సర్పంచ్ రాపాక రమేష్ బాబు, రిటైర్డ్ ఐఎఎస్ దేవ వరప్రసాద్, వైసీపీ నుంచి జనసేనలో చేరిన బొంతు రాజేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. దేవవరప్రసాద్ కు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నా… గొల్లపల్లిసూర్యారావు మాత్రం..కుమార్తె కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.