వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తనపై అనర్హతావేటు వేయించేందుకు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజీనామా లేఖలో వెటకారం చేశారు. మీడియాలో జగన్ రెడ్డిని ఎంత కామెడీ చేస్తారో తన రాజీనామా లేఖలోనూ అంత వెటకారంగా రాసి పంపించారు.
రఘురామకృష్ణరాజు వైసీపీ తరపున గెలిచినా.. ఆయనను రకరకాలుగా అవమానించి.. తమ పార్టీకి వ్యతిరేకంగా మారేలా చేసుకున్నారు. పార్టీతో విబేధించినప్పటి నుంచి రఘురామ.. రచ్చ బండ పేరుతో రచ్చ చేస్తున్నారు. జగన్ రెడ్డిని.. వైసీపీని ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నారు. బీజేపీకి ఎలా కావాలంటే అలా సహకరిస్తున్నా కాబట్టి ఎంపీపై అనర్హతా వేటు వేయిస్తానని చాలెంజ్ చేశారు. ప్రత్యేక విమానాలు మాట్లాడుకుని.. ఎంపీల్ని తీసుకెళ్లి స్పీకర్ ను కలిశారు. నోటీసులు అయితే ఇప్పించగలిగారు కానీ.. అనర్హతా వేటు మాత్రం వేయించలేకపోయారు. ఈ విషయంలో రఘురామకృష్ణరాజు.. జగన్ కన్నా బలవంతుడని నిరూపించుకున్నారు. జగన్ రెడ్డి అధికారం లో ఉన్నా.. తననేమీ చేయలేరని తేల్చారు.
కనీసం రఘురామరాజును సస్పెండ్ చేసినా వైసీపీకి పరువు నిలబడేది. కానీ ఆయనను సస్పెండ్ చేస్తే వేరే పార్టీలో చేరిపోతారన్న అనుమానంతో సస్పెండ్ కూడా చేయలేదు. తాను ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తున్నానని.. తన పార్టీని ఏమీ అనడం లేదని చెప్పి.. ఆయన తన విమర్శలు కొనసాగిస్తూ వస్తున్నారు. రఘురామకృష్ణరాజు విషయంలో జగన్ రెడ్డి చేయగలిగింది ఒక్కటే. ఆయన పుట్టిన రోజు ఇంట్లో ఉండగా తప్పుడు కేసులో అరెస్టు చేసి పోలీసులతో కొట్టించడం. అదే గొప్ప విజయం అని జగన్ రెడ్డి అనుకోవచ్చు కానీ… అది బలప్రయోగం… ఆ ఘటన పరిణామాలు వచ్చే రోజుల్లో చాలా బలంగా జగన్ రెడ్డి చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.