Siddharth Roy Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్
ఏ సినిమాకైనా విడుదలకు ముందు బజ్ సంపాదించడం అవసరం. చిన్న సినిమాలకు అది అత్యవసరం. అలా…. విడుదలకు ముందే ‘ఇందులో ఏదో ఉంది’ అనే ఆసక్తి రగిలించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో పోల్చడం ఒక ఎత్తయితే, దర్శకుడు యశస్వీకి తొలి సినిమా విడుదల కాకుండానే, రెండో సినిమా సుకుమార్ బ్యానర్లో చేసే ఛాన్స్ రావడం మరో ఎత్తు. అలా… ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో ‘సిద్దార్థ్ రాయ్’ సక్సెస్ అయ్యింది. మరి ప్రచారంతో ఆసక్తి రేకెత్తించిన సిద్దార్థ్ రాయ్ ఎలా ఉన్నాడు..? ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తనకున్న పోలిక ఏమిటి?
మనిషికి తిండి, నిద్ర, సెక్స్ మాత్రమే ప్రాధమిక అవసరాలని నమ్మే క్యారెక్టర్ సిద్దార్థ్ రాయ్ (దీపక్ సరోజ్)ది. చిన్నప్పటి నుంచీ పుస్తకాల మధ్యే పెరిగి.. ఆ విజ్ఞానాన్నంతా తన బుర్రలోకి ఎక్కించేసుకొన్నాడు. లాజిక్స్ తప్ప.. ఎమోషన్స్ లేని క్యారెక్టర్ తనది. అలాంటి సిద్దార్థ్ జీవితంలోకి ఇందు (తాన్వి) వస్తుంది. తనేమో జీవితంలోని ప్రతీ చిన్న మూమెంట్ నీ ఎంజాయ్ చేస్తుంటుంది. ఎమోషన్స్ ఎక్కువ. జీవితంలో మనిషికి కావాల్సింది ఎమోషన్స్ మాత్రమే అని సిద్దార్థ్ తెలుసుకొనేలా చేస్తుంది. అప్పుడు సిద్దార్థ్ ఏం చేశాడు, ఎమోషన్స్ వైపు మళ్లాడా..? అలా లాజిక్ వదిలేసి, ఎమోషన్స్ నమ్మితే.. తన జీవితం ఏమైంది? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
తొలి సినిమా అనగానే చాలామంది దర్శకులు సేఫ్ గేమ్ ఆడేద్దామని ఆలోచిస్తారు. లవ్ స్టోరీ, యాక్షన్, మాస్ సినిమాలలో మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఆ తరహా కథలు ఎంచుకొంటారు. కానీ యశస్వీ అలా అనుకోలేదు. లాజిక్స్‌తో బతికే వ్యక్తి సడన్‌గా ఎమోషన్స్ వైపు ఫ్లిప్ అయితే, తన లైఫ్ ఎలా ఉంటుందన్న ఓ కొత్త పాయింట్ తో సినిమా తీయాలనుకొన్నాడు. ఆ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. చాలామంది ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్తో పోలుస్తున్నారు, ఆయా సినిమాలకు కాపీలా చూస్తున్నారు కానీ… ఈ రెండు కథలకూ, సిద్దార్థ్ రాయ్‌కీ ఎలాంటి సంబంధం ఉండదు. ఆ విషయం తొలి సినిమాలతోనే అర్థమైపోతుంది. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా బతికే క్యారెక్టర్ని మనం నిజ జీవితంలో చూళ్లేం. అందుకే సిద్దార్థ్ రాయ్ పాత్ర పరిచయం, తన ఆలోచనలు, ప్రవర్తన అన్నీ కొత్తగా అనిపిస్తుంటాయి. ఆకలేస్తే అమ్మ చికెన్ వింగ్స్ తెచ్చేలోగా… దగ్గర్లో ఉన్న ఆకులు తినేస్తాడు సిద్దార్థ్. కడుపు నింపుకోవడానికి రుచితో సంబంధం ఏమిటి? అనేది సిద్దార్థ్ లాజిక్. అలాంటి వింత ప్రవర్తనతో ఆ పాత్రతో జర్నీ చేస్తాం. అయితే ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో ఓ చిక్కు ఉంది. ఆ పాత్రని ఫాలో అయితేనే కథనీ, అందులోని సంఘర్షణనీ అర్థం చేసుకోగలం. లేదంటే.. ఇదంతా అనవసరమైన రాద్దాంతంలా అనిపిస్తుంటుంది. సిద్దార్థ్ రాయ్ ప్రేమికుడిగా మారాక… ఆ లవ్ స్టోరీ మరింత ఆసక్తికరంగా సాగితే బాగుంటుంది. తన కళ్ల ముందు వేరే అమ్మాయిలతో సెక్స్ చేసిన ఓ వ్యక్తిని… ఎమోషన్స్‌కి వాల్యూ ఇచ్చే అమ్మాయి అంత ఈజీగా ఎలా ప్రేమలో పడిపోయింది? అనేది లాజిక్‌కి అందని విషయం. సిద్దార్థ్ రాయ్‌ని మార్చకొనే ప్రయత్నం… దాని చుట్టూ వచ్చే ఎపిసోడ్లు ‘ఆషికీ 2’ని గుర్తు చేస్తాయి.
సిద్దార్థ్ రాయ్‌ని మల్టీ మిలీయనీర్‌గా చూపించారు. తనేమో ‘ఇందు.. ఇందు’ అంటూ రోడ్లపై పిచ్చోడిలా తిరుగుతుంటే తల్లిదండ్రులేమైపోయారు? వాళ్లేం చేస్తున్నారు? అనేది అర్థం కాదు. ఫిలాసఫీ పేరుతో ఇంగ్లీష్ కొటేషన్లు దంచి కొట్టారు. అయితే.. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అంత పరిజ్ఞానం లేకపోవొచ్చు. ఆ ఎమోషన్ని అర్థం చేసుకోవాలా? లేదా పాత్రతో ప్రయాణం చేయాలా? ఇవన్నీ వదిలేసి ఇంగ్లీష్ డైలాగుని తెలుగులో ట్రాన్సలేట్ చేసుకోవాలా? మరదలు పాత్ర ఇంకా విచిత్రంగా తోస్తుంటుంది. ‘మా బావ ఎంత గొప్పోడో తెలుసా’ అని వాదిస్తుంటుంది. అసలు అంత గొప్పపని బావ ఏం చేశాడో అర్థం కాదు. ‘మా బావ సెక్స్ కావాలి అని అడిగితే ఎవరైనా సరే ఓకే చెప్పేయాల్సిందే’ అంటుంది. అంత గొప్పగా ఏం చెప్పి ఒప్పించాడా? అనే కుతూహలం కలుగుతుంది. అయితే సెక్స్ గురించిన ఓ సుదీర్ఘమైన డైలాగ్‌ని ఇంగ్లీష్ లో చెప్పిస్తాడు దర్శకుడు. ఆ మాత్రం పరిజ్ఙానానికే అమ్మాయిలు తమ మానాన్ని అప్పగిస్తారా? బోల్డ్ సన్నివేశాలు ఇందులో బోల్డన్ని ఉన్నాయి. అయితే అవేం.. యావగింపుని కలిగించవు. వాటిని వీలైనంత డీసెంట్ గానే తీశాడు. కొన్నింటికి కత్తెర వేయొచ్చు. ఆ ప్రయత్నం జరగలేదు. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. ఈ కథకు ఇలాంటి ముగింపు ఇవ్వడమే సరైంది కూడా. ఈ సినిమాలో హీరోకి ఎమోషన్స్ ఉండవు. సరే.. ఆ మాత్రం దానికే రోబోలా మాట్లాడడం ఎందుకు? శూన్యంలోకి చూస్తూ నడుస్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు అనిపిస్తుంది.
దీపక్ సరోజ్కి ఇదే తొలి సినిమా. బాల నటుడిగా ఇది వరకు కెమెరాతో తనకు పరిచయం ఉంది కాబట్టి… నటనలో ఎక్కడా తనబడలేదు. తన లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఎమోషన్ సీన్స్ లో ఇంకా బాగా నటించాడు. తన్వి చూడ్డానికి బాగుంది. తన పరిధిమేర చేసింది. యండమూరి వీరేంద్రనాథ్ ఓ పాత్రలో కాసేపు కనిపించారు. మిగిలినవాళ్లెవరికీ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలే. సాంకేతికంగా చూస్తే రధన్ సంగీతంలో ‘చెలియా’ పాట బాగుంది. మిగిలినవన్నీ కథని నడిపించేవే. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ పాత్ బ్రేకింగ్ కథలు. వాటి.. మేకింగ్ కూడా అలానే ఉంటుంది. ఐడియా పరంగా కొత్త తరహా కథని ఎంచుకొన్న యశస్వీ… మేకింగ్ పరంగా పాత స్టైల్ ని ఫాలో అయ్యాడు. బహుశా… బడ్జెట్ పరిమితులు అడ్డుపడి ఉండొచ్చు. క్వాలిటీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.
ఫినిషింగ్ టచ్: ఫిలాసఫీ పాఠం
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్