ఎప్పుడూ కొత్త తరహా కథలు, వెరైటీ క్యారెక్టరైజేషన్స్ తో కమర్షియల్ టచ్ ఉన్న ప్రయోగాలు చేస్తుంటాడు నాని. తన కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ కూడా అలాంటి ప్రయత్నమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దానయ్య నిర్మాత. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా `సరిపోదా శనివారం` నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ‘వారంలో ఒక్కరోజు మాత్రమే తన కోపాన్ని చూపించే పిచ్చినాకొడుకు’ పాత్రలో నానిని పరిచయం చేశారు. ప్రతి శనివారం హీరోకి కోపం వస్తుంటుంది. లేదా వారంలో వచ్చిన కోపాన్నంతా శనివారమే తీర్చుకొంటుంటాడు. ఇదీ.. ఈ సినిమా కాన్సెప్ట్. కథాంశం పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా కొత్తగానే అనిపిస్తోంది. గ్లింప్స్‌లో నాని పూర్తి స్థాయిలో మాసిజం చూపించాడు. ‘సమవర్తీ’ అంటూ సాగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టీవ్‌గా అనిపించింది. నాని సినిమాలన్నీ సరదాగా ఉంటాయి. వివేక్ ఆత్రేయ కూడా అలాంటి కథలే ఎంచుకొంటాడు. అయితే ఈసారి నానిని పూర్తిగా మాస్ కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నమిదని అనిపిస్తోంది. కోపం ఓ నెగిటీవ్ ఎనర్జీ. దాన్ని క్రమబద్ధంగా వాడితే ప్రయోజనమే అని చెప్పే సందేశం ఏదో… ఈ కథలో ఉన్నట్టు అనిపిస్తోంది. దానికి నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ ఎలా జోడించారన్నది ఆసక్తికరం. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు.