టాలీవుడ్ లో ప్రతిభావంతులైన సంగీత దర్శకులకు కొదవ లేదు. కీరవాణి, తమన్, దేవిశ్రీలతో పాటు భీమ్స్, మిక్కీ జే మేయర్ లాంటివాళ్లు అందుబాటులో ఉన్నారు. రధన్ పేరు కూడా బాగా పాపులర్. చిన్న, మీడియం సైజు సినిమాలకు తను మంచి ఆప్షన్ కూడా. తన చేతిలో హిట్లు కూడా ఉన్నాయి. అయితే… టైమ్ మేనేజ్మెంట్ విషయంలో రధన్ అడ్డంగా దొరికిపోతున్నాడు. దర్శకులకు ట్యూన్స్ సరైన టైమ్ లో ఇవ్వకుండా విసిగిస్తాడని, తన వల్లే చాలా సినిమాలు డిలే అవుతున్నాయన్నది ప్రధానమైన ఆరోపణ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి తనే సంగీతం అందించాడు. పాటలు సూపర్ హిట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అయితే.. సందీప్ రెడ్డి వంగా రధన్ పేరెత్తితే మండిపోతాడు. ఎందుకంటే.. ఆ సినిమా సమయంలో అంతగా టార్చర్ పెట్టాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు సందీప్. ఇప్పుడు ‘సిద్దార్థ్ రాయ్’ దర్శకుడు యశస్వీ కూడా అదే కంప్లైంట్ చేశాడు. ఓ ప్రెస్ మీట్ లో యశస్వీ చేసిన కామెంట్లు బాగా వైరల్ అయ్యాయి. రధన్ పనితీరుపై మరోసారి టాలీవుడ్ లో చర్చ మొదలైంది.
ఓ ట్యూన్ ఇస్తానని చెప్పి నెలల తరబడి తిప్పించుకొంటాడని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇబ్బంది పెడతాడని, డబ్బులు తీసుకొని, పని చేయకుండా విసిగిస్తాడని రధన్ గురించి అందరూ కథలు కథలుగా చెబుతుంటారు. సంగీతం అనేది పూర్తిగా క్రియేటీవ్ జాబ్. చేసే పనిమీద శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. అందుకోసం సమయం తీసుకొంటారు కూడా. అయితే… మరీ నెలల తరబడి కాలయాపన చేయడం నిర్మాతల్ని ఇబ్బంది పెట్టేదే. సినిమావాళ్లకు టైమ్ సెన్స్ చాలా అవసరం. తక్కువ టైమ్ లో అవుట్ పుట్ ఇవ్వాల్సివస్తుంటుంది. ప్రతీ సినిమా ఆచి తూచి పని చేయాలి అనుకొన్నప్పుడు సినిమాల్ని కూడా తక్కువగానే ఒప్పుకోవాలి. కానీ రధన్ విషయంలో అది జరగదు. అడ్వాన్సులు తీసుకొన్న తరవాతే రధన్ అసలు రూపం బయటపడుతుందని దర్శకులు, నిర్మాతలూ రధన్‌పై కంప్లైంట్లు చేస్తున్నారు. రధన్ ఈ విషయంలో మారాల్సిందే. లేదంటే తన కెరీర్‌కి తానే పెద్ద విలన్ అవుతాడు.