జనసేన, టీడీపీ తొలి జాబితానుప ప్రకటించాయి. రెండు పార్టీల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. గజపతినగరం టీడీపీ ఇన్ ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు తన రాజీనామాను ప్రకటించారు. అతను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించారు. నిజానికి ఈయన అప్పలనాయుడు సోదరుడి కుమారుడే. అలాగే విశాఖ పశ్చిమ సీటు ఆశించిన పాశర్ల ప్రసాద్ కు కూడా బంగపాటు కలగడంతో టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటుగా రాయచోటి నుంచి పోటీలో నిలవాలని చూసిన రమేష్ రెడ్డి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన అనుచరులతో పాటు రాజీనామా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ అభ్యర్థిగా సవితను ఖరారు చేశారు. దీంతో పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
తెనాలి సీటును జనసేనకు కేటాయించారు. ఈ విషయంపై టీడీపీలో వివాదం చెలరేగుతోంది. టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా పార్టీని నమ్ముకున్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచారు. ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడతామని ఆయన అనుచరులు ప్రకటించారు. కృష్ణా జిల్లా పెడన నియోజవర్గం టీడీపీలో అసంతృప్తి నెలకొంది. పెడన టిక్కెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. దీంతో, తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశంలో ఉన్నట్టుండి అస్వస్థతకు గురై పడిపోయారు వేదవ్యాస్. వెంటనే అలర్ట్ అయిన కార్యకర్తలు అతడిని ఆసుపత్రికి తరలించారు.
జనసేనలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్ చార్జి పాటంశెట్టి సూర్యచంద్రకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా జగ్గంపేట టీడీపీకి కేటాయించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. అయితే మొదటి నుండి జనసేనలో కష్టపడుతూ.. టికెట్ ఆశించిన సూర్యచంద్ర సీటు దక్కకపోవడంతో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు