మానవ అస్ధిత్వానికి మూలంగా భావించే దైవాన్ని అవ్యక్త స్ధితి నుంచి మేల్కొల్పి, గర్భగృహ నిర్మాణం చేసి, ఆ ఆవరణను పవిత్రీకరించడం హిందూ మతంలో కీలకాంశం. దైవానికి మానవరూపాన్ని ఆపాదించి, స్నానం చేయించి, ఊరేగించి, తినిపించి, స్త్రీ దేవతను జతచేసి సంతృప్తి పొందే హిందూ జీవనంలో చిత్తచాంచల్యాన్ని నిరోధించే ఆలోచన కనిపిస్తుంది. లక్ష్యాలు గమ్యాల మీద దృష్టి, ఏకాగ్రతలను సాధించే ఒక మార్గదర్శనం వుంది.
చరిత్రతో ముడిపడి వున్న ప్రాచీన ఆలయాలు, కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో లేబుల్ వేస్తుంది. మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నో ఆలయాలకు ఆ గుర్తింపు వుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఆలయానికి కూడా వారసత్వ సంపదగా గుర్తింపు లేదు.
దాక్షారామ, శ్రీశైలం, అమరావతి, పాలకొల్లు మొదలైన అనేక ప్రాంతాలలో శివాలయాలతో సహా తిరుమలలో వెంకటేశ్వరాలయం, తాడిపత్రిలో చింతల వెంకటరమణ ఆలయం, చేజెర్లలో కపోతేశ్వర ఆలయం, మొదలైన ఎన్నో గుడులు ప్రాచీన మైనవే. ప్రాచీన సాంప్రదాయాల మేరకే వున్నవే!
వీటి మరమ్మత్తులు నిర్వహణల్లో కేవలం ఆధునికత మీద మాత్రమే దృష్టిపెట్టిన ప్రభుత్వాలు, ట్రస్టు బోర్డు పెద్దలు అందులో ప్రాచీన, సాంస్కృతిక మూలాలను మార్చేయడం లేదా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చింది.
భౌతిక ప్రయోజనాలు, తక్షణ అవసరాలమీదే ఆంధ్రప్రదేశ్ ను పాలించిన అన్ని ప్రభుత్వాలూ దృష్టిపెట్టాయి. హేతువాదుల పాలనా ప్రాబల్యంవున్న తమిళనాడులో ప్రభుత్వాలు ఎన్నడూ మూలాలను దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఆలయాల జీర్ణోద్ధరణను ఆగమ వాస్తు పండితులకే వదిలేశారు. ఇదే వాతావరణం కర్నాటక కేరళల్లో కూడా వుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ గుడిలో అయినా రాతి స్ధంభం కూలిపోతే స్టీల్ ఫ్రేముతో గట్టిగా కాంక్రీట్ వేయించండి అనే ముఖ్యమంత్రులే వున్నారు. ఈ దృక్పధం వల్లే ప్రాచీనత వేగంగా శిధిలమైపోతోంది.
ప్రార్ధనాలయాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను వాటివల్ల ఏర్పడిన యాంబియన్స్ పాడవ్వకుండా జీర్ణోద్దరణ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వాటి ఫలితాలు కనబడుతున్నాయి. వాటిని మనం కూడా పాటిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రాచీన ఆలయాలకు దేశదేశాల యాత్రికులు వస్తారు.
మన పూర్వీకుల ఉద్దేశం ప్రకారం దేవాలయాలు సమాజానికి ఉమ్మడి ఆస్ధిగా వుండాలి. ధార్మిక, నైతిక, మానసిక పరివర్తనా కేంద్రాలుగా వుండాలి. వీధుల్లో యాచకులను నిరోధించి ఆశ్రయమిచ్చే కేంద్రాలు కావాలి. మానసిక ప్రశాంతతకు ఆశ్రయాలు అవ్వాలి.
అందుకు తగిన ఏంబియన్స్ అవసరం…దాన్ని కొత్తగా సృష్టించనవసరంలేదు. ఉన్నదాన్నే బయటపడేలా ట్రిమ్ చేస్తే చాలు!