పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీలోపు రానుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదటి విడతలోనే జరుగుతుంది. అయినా భారత రాష్ట్ర సమితి లో నిర్లిప్తత కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికల వ్యూహంపై అసలు ఎలాంటి కసరత్తు చేయడం లేదు. కీలకమైన సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కాగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. నల్లగొండలో నిర్వహించిన కృష్ణా జలాల హక్కుల సాధన, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన బహిరంగ సభ తర్వాత వరుస కార్యక్రమాలు పెడతారని అనుకున్నారు. కానీ మళ్లీ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. హైదరాబాద్లో భారీ బహిరంగసభ అని.. కేటీఆర్, హరీష్ పాదయాత్ర అని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి కానీ.. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇలాంటి వాటికి అవకాశం ఉండదు.
కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వాటిని పరిశీలించి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. పార్లమెంటు స్థానాలవారీగా కాంగ్రెస్ నాయకత్వం మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 స్థానాలకుగాను కనీసం 14 స్థానాలను దక్కించుకోవాలని పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విజయం కాకపోయినా ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసింది. విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆరెస్తోపాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు.
కానీ బీఆర్ఎస్ మాత్రం … ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. బీజేపీతో పొత్తు కోసం బీఆరెస్ తన శక్తియుక్తులను ప్రయోగిస్తున్నదన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. అంతా కలిపి ముందే చేతులెత్తేశారన్న అభిప్రాయం బలపడుతోంది.