బీఆర్ఎస్ లో ఇప్పుడు కవిత మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో, కవిత జాతీయ రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీగా ఉన్నప్పుడు .. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడూ కవితే కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె కేటీఆర్ కన్నా ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పై తరచూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై నిలదీశారు. బాధితుల్ని కలిసేందుకు వెళ్లిపోతున్నారు.
పార్టీ ఓడిపోయిన నిరాశలో నేతలందరూ ఉండగానే కవిత వేగంగా మేలుకున్నారు. వెంటనే ప్రభుత్వంపై బీసీ అస్త్రం ప్రయోగించారు. గత పదేళ్లలో ఒక్క సారి కూడా ప్రస్తావించకపోయినా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యమం ప్రారంభించారు. దీనికోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ కూడా విధించారు. కింది స్థాయి వరకూ బీసీల్లోకి దీన్ని తీుకెళ్తున్నారు. ఓబీసీ జనగణన చేపట్టి, మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటిపారుదల శాఖపై కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేత పత్రం, కాగ్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టులపై సర్కారు వైఖరిని కవిత తిప్పి కొట్టారు. దీంతోపాటు పలు సమస్యలను శాసనమండలిలో కవిత వినిపించారు. సచివాలయ ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపైనా కవిత విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చు కోసం తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు.
కవిత అన్నీ తానై వ్యవహరిస్తూ విమర్శల ధాటిని పెంచారు. ఇతర బీఆర్ఎస్ నేతల కంటే.. కవితనే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కానున్నారు. దీంతో ప్రతిపక్ష నేతగా మరింత ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావు పెద్దగా ఫోకస్ కావడం లేదు.