ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూనే ఉంది. ఇప్పుడు స్వయంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ వెనుక వున్న కథ చెప్పారు.
‘కల్కి కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6,000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. ఓ కొత్త ఓ ప్రపంచాన్ని సృష్టించాం. ఇందులో ఇండియన్ ఫ్యూచర్ సిటీలని తీర్చిదిద్దాం. ఇప్పటివరకూ ఇలాంటి ఫ్యుచరిస్టిక్ సిటీలని హాలీవుడ్ లో చూసుంటారు. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుంటాయో కల్కిలో చూడబోతున్నారు” అని చెప్పారు నాగ్ అశ్విన్. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కమల్ హసన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. మే9న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.