తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. సోనియా ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో టీపీసీసీ తీర్మానం చేసింది. కానీ ఆరోగ్యం, వయసు రీత్యా ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ వయనాడ్ స్థానంలో కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయనున్నారు. అందుకే ఈ సారి .. తెలంగాణ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రాహుల్ టీం .. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో సంప్రదింపులు జరిపింది. సర్వే రిపోర్టులు ఇతర అంశాలతో రెండు స్థాలను ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకటి ఖమ్మం కాగా మరొకటి భువనగిరి. రెండు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలే. అయితే ఖమ్మం ఇంకా బలమైన సీటు. అక్కడ కాంగ్రెస్ కు ఇప్పుడు సరైన ప్రత్యర్థి లేదు. బీఆర్ఎస్ నుంచి నేతల వలసతో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా పార్టీ మారిపోయింది. బీజేపీ ఉనికి దాదాపుగా లేదు. దీంతో ఖమ్మంలోనే రాహుల్ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
సోనియా, రాహుల్ గాంధీలు యూపీలోని రాయ్ బరేలీ, అమేథీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో రాహుల్ అమేథీ తో పాటు వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు సమాజ్ వాదీతో పొత్తు కుదిరింది. ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ అక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.అయితే దక్షిణాది నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. ప్రియాంకా గాంధీ యూపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.