బీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి ఒంటి కాలి మీద లేస్తున్నారు . చేవెళ్ల బహిరంగసభలో ఆయన కేసీఆర్, కేటీఆర్ పై విచురుకుపడిన వైనం వైరల్ గా మారింది. ఒక్కటంటే.. ఒక్క లోక్ సభ సీటు గెల్చుకుని రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అన్నేసి మాటలన్నా… బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. బాల్క సుమన్ లాంటి వాళ్లను ముందు పెట్టి ప్రతి సవాల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇలా రేవంత్ చేసే ఎదురుదాడికి దళిత నేతల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే.. క్యాడర్ లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.
ఓ వైపు రేవంత్.. ఆరు గ్యారంటీల విషయంలో తన పని తాను చేసుకుపోతున్నారు. గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ హామీలను ప్రారంభించారు. ఇవి పేద మహిళలు అందరికీ అందుతాయి. ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయవచ్చు కానీ.. వైట్ రేషన్ కార్డు అర్హతగా అందరికీ ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. హామీల అమలు పై ఎన్ని విమర్శలు చేసినా మూడు నెలల్లోనే … అందరికీ ఏదో ఓ లబ్ది కలిగేలా పథకాల్ని ప్రారంభిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇది లబ్ది చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది.
మరో వైపు బీఆర్ఎస్ పరిస్థితి రాను రను దిగజారిపోతోంది. ఆ పార్టీకి లోక్ సభ అభ్యర్థులే కాదు.. ఎజెండా కూడా లేకుండా పోయింది. కృష్ణా నీటిని ఎజెండాగా చేద్దామనుకుంటే.. మేడిగడ్డతో రివర్స్ కౌంటర్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. మరో వైపు బీజేపీ .., మోడీని, రామ మందిరాన్ని ముందు పెట్టి ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ కు ఏజెండా ఉంది. బీఆర్ఎస్ కు మాత్రమే.. ఓట్లు ఎందుకు వేయాలని అడగాలో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్సే తెలంగాణ వాయిస్ అని చెప్పుకుంటున్నారు కానీ… టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశాక… దాన్ని కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు.