ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే ప్రచార హోరులో ప్రతిపక్షాలు మాత్రమే నిపిస్తున్నాయి. రెండు,మూడు వారాలకు ఓ సిద్ధం సభ పెడుతున్న వైఎస్ఆర్సీపీ ఈ మధ్యలో కనిపించడం లేదు. జగన్ సిద్ధం అంటున్నారు.. కానీ తాము ఎప్పడో సిద్ధమని విపక్షాలు ఎన్నికల బరిలోకి దిగిపోయాయి. చంద్రబాబునాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రా కదలిరా సభలు నిర్వహించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ శంఖారావం పేరుతో ఉత్తారంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. మరో వైపు నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో పర్యటిస్తున్నారు.
రాష్ట్రాన్ని నాలుగు వైపుల నుంచి కమ్ముకుని ప్రచారం చేయడానికి అవసరమైన స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ, జనసేన కూటమికి ఉన్నారు. రెండు పార్టీల మొదటి ఉమ్మడి సభ తాడేపల్లి గూడెంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తయింది. తర్వాత జిల్లాలు..నియోజకవర్గాల వారీగా ప్రచారం చేయనున్నారు. ఇక జనసేన వైపు నుంచి క్రౌడ్ పుల్లర్ పవన్ కల్యాణ్ ఎలాగూ ఉంటారు. ఈ ముగ్గురూ రాష్ట్రం మూడు దిక్కుల ప్రచారం చేస్తే.. అధికార పార్టీ ప్రచారం తేలిపోతుంది. మరో వైపు పవన్ కల్యాణ్ కోసం.. జనసేన కోసం..సినీ తారలు తరలి వస్తారు. వీరి ప్రచారంతో రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన కూటమే కనిపిస్తూ ఉంటుంది. ఒక వేళ బీజేపీ కూటమిలోకి వస్తే.. ప్రధానమంత్రి కూడా ప్రచారానికి వస్తారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లాల పర్యటన కూడా పూర్తి చేయలేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ తర్వాత మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అంటే గట్టిగా నెల రోజుల మాత్రమే సమయం ఉంటుంది. ఈ నెలలోనే పార్టీ వ్యవహారాలన్నింటినీ చూసుకోవడంతో పాటు జగన్ ప్రచారం చేయాల్సిఉంటుంది. గతంలో జగన్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు. ఈ సారి వారు కూడా లేరు. ఈ కారణంగా ప్రచార భారం అంతా తాను ఒక్కరే మోయాల్సి ఉంది.
ఎలా చూసినా టీడీపీ, జనసేన కూటమికి.. ప్రచార అడ్వాంటేజ్ కలిసి వస్తుంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే.. టీడీపీ, జనసేన స్పష్టతకు వచ్చాయి. వైసీపీ ఇంకా జాబితా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు జాబితా ప్రకటించిన తర్వాత వచ్చే తలనొప్పులను కవర్ చేసుకుంటూ.. ఎన్నికల ప్రచారం చేయడం అంత తేలిక కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ప్రచారంలో వెనుకబడి పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది.