నాయికా ప్రాధాన్యం ఉన్న కథలకు ఎప్పుడూ టాలీవుడ్ లో గిరాకీ ఉండనే ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి లాంటి వాళ్లు ఇలాంటి చిత్రాలతోనే స్టార్డమ్ సంపాదించుకొన్నారు. హీరోయిన్లకు సీనియారిటీ వచ్చాక, తమలోని కొత్త కోణాల్ని ఆవిష్కరించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం పరిపాటే. కొంతకాలంగా భాషతో సంబంధం లేకుండా అన్ని సీమల్లోనూ… హీరోయిజం పోటెత్తుతోంది. మాస్, మసాలా, యాక్షన్.. వీటికే పెద్ద పీట వేస్తున్నారు కథకులు. దాంతో లేడీ ఓరియెంటెడ్ ట్రెండ్ తగ్గుమొహం పట్టింది. అయితే ఇప్పుడు ఇలాంటి కథలకు మళ్లీ జీవం వచ్చినట్టే కనిపిస్తోంది. అగ్ర దర్శకులు సైతం ఇలాంటి కథలవైపు మొగ్గు చూపిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘వేదం’ తరవాత సెట్ అయిన కాంబో ఇది. పైగా అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి చాలాకాలమైంది. దాంతో ఈ సినిమాపై ఫోకస్ పడింది. ఈ చిత్రంలో అనుష్క ఫైట్లు చేయబోతోందని, యాక్షన్ సీన్లను ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని టాక్. కృష్ణవంశీ సైతం ఇప్పుడు ఓ నాయికా ప్రాధాన్యం ఉన్న కథని రాసుకొని, సరైన హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాడు. కృష్ణవంశీ కథల్లో ఏదో ఓ బలమైన సామాజిక అంశం ఉంటుంది. ఈసారి ఆయన మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఓ కథ రాసుకొన్నారు. `రాఖీ`కి ఇది ఫీమేల్ వెర్షన్ లాంటిదన్నమాట. త్వరలోనే డిటైల్స్ తెలుస్తాయి.
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గర ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టు ఉంది. ఆయన దర్శకత్వం వహిస్తారా, లేదంటే ఆ కథని మరొకరితో టేకప్ చేయిస్తారా? అనేది తెలియాల్సివుంది. అనిల్ రావిపూడి సైతం ఇలాంటి కథ ఒకటి రాసుకొన్నారు. ఆయనకున్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ కాస్త లేటవుతోంది. సమంత కోసం ఓ అగ్ర దర్శకుడు ఓ కథ పట్టుకొని ప్రయత్నిస్తున్నారు. అందులో యాక్షన్ మోతాదు కాస్త ఎక్కువగా ఉండబోతోందని తెలుస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దగ్గర ‘బెంగళూరు నాగరత్తమ్మ’ అనే స్క్రిప్టు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. అనుష్క, సమంత లాంటి కథానాయికలు సెట్ అయ్యే కథ ఇది. ఈ స్క్రిప్టు చేతులు మారి, మరో దర్శకుడు టేకప్ చేయబోతున్నాడని సమాచారం. ఆయనకు కూడా హీరోయిన్ దొరికితే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది. కాజల్ చేస్తున్న ‘సత్యభామ’ కూడా లేడీ ఓరియెంటెడ్ కథే. కాజల్, అనుష్క, సమంత, సాయిపల్లవి లాంటి స్టార్ మెటీరియల్ మన దగ్గర ఉంది. కథ మొత్తాన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించడంలో సమర్థులు వీళ్లు. అందుకే ఈ తరహా కథలు ఇప్పుడు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. హీరోలంతా యేడాదికి, రేండేళ్లకు ఓ సినిమా చేసుకొంటూ దర్శకులకు అందుబాటులో ఉండకుండా పోతున్నారు. అందుకే మధ్యేమార్గంగా హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్టుల్ని వెదుక్కొంటున్నారు దర్శకులు.