బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. సరైన స్క్రిప్టుతో రావాలి కానీ, నటించడానికి హీరోలు, ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలూ సిద్ధంగానే ఉన్నారు. ఎంత పాపులర్ ఫిగర్ అయితే, ఆ సినిమాకి అంత మైలేజీ. పైగా పాన్ ఇండియా మార్కెట్ కూడా ప్లస్ అవుతుంది. అందుకే రానా కూడా ఓ బయోపిక్‌పై మనసు పడ్డాడు. బాక్సింగ్ కింగ్… మహ్మద్ అలీ బయోపిక్ చేయాలని రానా భావిస్తున్నాడు. బాక్సింగ్ రింగ్ లో అద్భుతాలు సృష్టించిన మహ్మద్ అలీ, నిజ జీవితంలో కూడా చాలా కమర్షియల్ హంగులు ఉన్నాయి. తన కథ స్ఫూర్తివంతం. అలీ కథ ఆధారంగా హాలీవుడ్ లో కొన్ని సినిమాలొచ్చాయి. ఇండియన్ స్క్రీన్‌పై, ముఖ్యంగా తెలుగులో అలాంటి ప్రయత్నం జరగలేదు. అందుకే రానా ఈ కథపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
సినిమాగా కాకపోయినా, కనీసం వెబ్ సిరీస్‌గా అయినా, తన కథని చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అలీ కథకున్న స్పాన్ పెద్దది. అందుకే వెబ్ సిరీస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు ఒకరిద్దరు దర్శకులతో రానా తన ఐడియా పంచుకొన్నాడట. రానా ఫిజిక్, పర్సనాలిటీ.. బాక్సింగ్ కథలకు సరిగ్గా సరిపోతాయి. ఇలాంటి కథలు చేయాలంటే పాన్ ఇండియా ఇమేజ్ అవసరం. బాహుబలి లాంటి సినిమాలతో, రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్‌లతో బాలీవుడ్ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నాడు. అందుకే తనకు ఈ కథ టేలర్ మేడ్ గా ఉంటుంది. మరి ఈ కథని ఏ దర్శకుడి చేతిలో పెడతాడో చూడాలి.