Bhoothaddam Bhaskar Narayana Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
డిటెక్టివ్ థ్రిల్లర్స్ ఎవర్ గ్రీన్ ఫార్మూలా. కంటెంట్ బావుంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించే జోనర్ ఇది. అయితే ఈ తరహా సినిమాలతో మెప్పించం అంత తేలిక కాదు. ప్రేక్షకుడికి ప్రతి సన్నివేశంలో ఏదో ఒక థ్రిల్ అందిస్తూ కథని ఆద్యంతం పట్టుతో నడపాలి. నిజానికి తెలుగులో ఈ జోనర్ సినిమాలు కూడా తక్కువే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తర్వాత మళ్ళీ చెప్పుకొదగ్గ డిటెక్టివ్ కథ రాలేదు. ఇప్పుడు యువ కథానాయకుడు శివ కందుకూరి ఓ డిటెక్టివ్ కథతో వచ్చాడు. అదే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల ద్రుష్టిని కాస్త ఆకర్షించింది. ఓ డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా? తెలుగులో మరో చెప్పుకొదగ్గ డిటెక్టివ్ సినిమాగా నిలిచిందా?
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో దిష్టి బొమ్మ హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో సైకో మహిళల్ని హత్య చేసి తల స్థానంలో దిష్టిబొమ్మని పెట్టి అడవుల్లో మృతదేహాన్ని వదిలేస్తుంటాడు. అలా 17 హత్యలు చోటు జరుగుతాయి. ఈ కేసుని ఎంత పరిశోధించినా ఒక్క క్లూ దొరకదు. ఈ కేస్ని పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఇతనొక లోకల్ డిటెక్టివ్. కళ్ళ జోడు లేకపోతే సరిగ్గా చూపు కూడా ఆనదు. అలాంటి భాస్కర్ ఈ కేసుని ఎలా చేధిస్తాడు? అసలు సైకో కిల్లర్ లక్ష్యం ఏమిటి? ఒక్కడే అన్ని హత్యలు ఎలా చేశాడు? అసలు భాస్కర్ నారాయణ డిటెక్టివ్ కావాలని ఎందుకు అనుకున్నాడు? ఈ హత్యలకు, పురాణాలకు వున్న లింక్ ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.
ప్రేక్షకులని థియేటర్స్ లో కూర్చొబెట్టాలంటే కంటెంట్ లో ఏదో కొత్తదనం వుండాలి. భూతద్దం భాస్కర్ నారాయణకి మరీ గొప్పదని చెప్పలేం కానీ ఓ ఆకర్షనీయమైన కాన్సెప్ట్ అయితే కుదిరింది. ఒక సైకో కిల్లర్ హత్యలకు పురాణాలతో ముడిపెట్టిన వైనం కాస్త కొత్తదే. అయితే కాన్సెప్ట్ వుంటే సరిపోదు. అది తెరపైకి ఆకట్టుకునేలా తీసుకొచ్చే నేర్పు వుండాలి. ఈ విషయంలో కాస్త తడబడ్డాడు దర్శకుడు పురుషోత్తం రాజ్. ఒక టెర్రిఫిక్ సీక్వెన్స్ తో కథని మొదలుపెట్టిన దర్శకుడు.. అదే గేర్ లో వెళ్ళకుండా అప్పటివరకూ వున్న హైని డౌన్ చేస్తూ… భాస్కర్ నారాయణ వైపు నుంచి కథని చెప్పుకుంటూ వెళ్ళాడు. భాస్కర్ నారాయణ బ్రదర్ ఎపిసోడ్ త్వరగానే ముగిసిపోతుంది. అది సినిమాలో కీలకం కూడా. తర్వాత డిటెక్టివ్ భాస్కర్ నారాయణ తెలివిని సరదా చూపించే సన్నివేశాలు మరీ చెప్పుకునేలా ఉండకపోయినా బోర్ కొట్టవు. అయితే దర్శకుడి సమస్య ఏమిటో కానీ అసలు పాయింట్ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన హీరోయిన్ అక్క మర్డర్ కేసు అనవసరమైన ఉప కథలా అనిపిస్తుంది. చెప్పడానికి కంటెంట్ వున్నప్పుడు ఇలాంటి టైం పాస్ మిస్ లీడింగ్ కథనాలు అనవసరం.
సెకండ్ హాఫ్ కథలో వేగం వస్తుంది. సైకో కిల్లర్ ఎవరో తెలుసుకునే క్రమం ఆసక్తిగానే వుంటుంది. ఒకొక్క చిక్కుముడి విప్పుతూ చివరి నిజాన్ని విప్పడం ఈ జోనర్ కథల స్టయిల్. ఇందులో కూడా అదే పద్దతి వుంటుంది కానీ బిగినింగ్ లో వేసిన చిక్కుముళ్ళు అంత బలంగా వుండవు. పైగా కథని అనవసరంగా సాగదీస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రిక్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. ఇక చివర్లో సైకో కిల్లర్ రివిల్ చేసిన విధానం కాస్త షాకింగానే వుంటుంది. నిజంగా ఆ పాత్ర చేసిన నటుడు అలాంటి గెటప్ లో కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి కథలు ట్విస్ట్ తెలిసిన తర్వాత త్వరగా ముగించేయాలి. కానీ ఇందులో మాత్రం క్లైమాక్స్ ని అవసరానికి మించి లాగేశారానే భావన కలుగుతుంది. నిజానికి చివర్లో ఆ స్లో మోషన్ ఎఫెక్ట్స్ ఇలాంటి కథలకు నప్పని వ్యవహారంలా వుంటుంది. దీనికి పార్ట్ 2 కూడా వుందని హింట్ ఇచ్చారు చివర్లో.
లోకల్ డిటెక్టివ్ గా శివ కందుకూరి పాత్రని మలిచిన విధానం కొత్తగా వుంటుంది. పక్కింటి కుర్రాడిలా లుంగీ కట్టుకునే డిటెక్టివ్ తను. మొదట్లో అ పాత్రని కాస్త హుషారుగా నడిపారు. ఆ సన్నివేశాల్లో చలాకీగా నటించాడు శివ. సెకండ్ హాఫ్ లో మాత్రం తన పాత్ర పూర్తిగా సీరియస్ టోన్ ని తీసుకుంటుంది. తన స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. కాస్త హుషారుగా వుండే పాత్రలు చేసే యీజ్ తనలో కనిపించింది. లక్ష్మీ పాత్రలో చేసిన రాశి సింగ్ అందంగా, తెలుగమ్మాయిలా కనిపించింది. హీరోకి స్నేహితుడిగా చేసిన నటుడు నవ్విస్తాడు. షఫీ, దేవి ప్రసాద్ వర్షిణీ ఈ పాత్రలన్నీ పరిధిమేర వుంటాయి.
శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ లో చాలా కష్టపడ్డాడు. నిజానికి ఇందులో కొన్ని డల్ సీన్స్ వున్నాయి. వాటిని కూడా తన స్కోర్ తో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ కి ఇచ్చిన ట్రాక్ హంటింగ్ గా వుంటుంది. కెమరావర్క్ డీసెంట్ గా వుంది. పురాణ నేపధ్యాన్ని లేయర్ యానిమేషన్ లో చూపించారు. అది ఇంకాస్త ఎఫెక్టివ్ గా వుండాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగట్టుగా వున్నాయి.
దర్శకుడు ఒక యూనిక్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు కానీ దాన్ని గ్రిప్పింగ్ గా చెప్పడంలో ఇంకాస్త నేర్పు చూపించి వుంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా వుండేది.