బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇచ్చుకున్నారు, మంచిదే. కాని ఆ వివరణ కూడా విచిత్రంగా వుంది. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావనీ, ఎవరైనా నొచ్చుకుని వుంటే మన్నించమని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. భోలా హీరో గనక ఏదో సరిపెట్టుకుందామనుకున్నా తాతయ్య దశలో వున్న మనిషికి తన వ్యాఖ్యల స్వభావం తెలియదా? వాటిని ఎవరినో ఉద్దేశించి చేసే అవకాశం గాని, ప్రత్యేకించి ఎవరైనా నొచ్చుకునే అవకాశం గాని ఎలా వుంటుంది? మహిళల గౌరవానికి భంగం కలిగించేవిగా వున్నాయనేది విమర్శ. నిజం కూడా. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో తన మాటలపై బేషరతుగా విచారం వెలిబుచ్చి వెనక్కు తీసుకున్నానంటే ఎంతబాగుండేది? ఈ సన్నాయి నొక్కులు సంజాయిషీలు అవసరమా? అసలు వారిని వదిలేసినా- అంత పెద్ద స్థానాల్లో వుండేవారి సలహాదారులు సహాయకులు ప్రకటనలు రాసేవారు ఈ మాత్రం ఆలోచించరా? ప్చ్!
ఈ మాటలే కాదు- గతంలో అలీ వంటి వారు లేదా మరెవరైనా సరే హాస్యం అంటే ఆడవారి గురించి తేలిగ్గా చవగ్గా మాట్లాడ్డం అనే భావన నుంచి బయిటపడటం సంస్కారం. అసలు మన సినిమా లోకమే మహిళలను ఆటబొమ్మలుగా చూపడంపై సగం ఆధారపడి వుంటుంది. ఒక హీరోకు ముగ్గురు హీరోయిన్లను తీసుకోవడం అదీ చాలక ఐటం సాంగ్స్ ఇంత మంది కూడా కేవలం హీరో చుట్టూ తిరగడం తప్ప వేరే ప్రాధాన్యత లేకపోవడం దురదృష్టకరం.ఒకసావిత్రి ఒక వాణిశ్రీ,శారద, సుహాసిని, సౌందర్య వంటివారి పాత్రలు ఇప్పుడు వూహించడమే దాదాపు కష్టమై పోతున్నది. ఇలాటి అవాకులు కూడా అందుకే వస్తుంటాయి.