మేడిగడ్డ కూలిపోతే.. బీఆర్ఎస్ కూడా కుప్పకూలిపోతుందన్న కుట్రతోనే రేవంత్ రెడ్డి .. మేడిగడ్డకు రిపేర్లు చేయించడం లేదని కేటీఆర్ ఆవేదనతో కూడిన ఆగ్రహంతో మండిపడ్డారు. పార్టీ నేతలో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన ఆయన … ఆయన ఎమ్మెల్యేలు… ఇతర నేతలు అందరూ చెప్పేది ఒక్కటే. వెంటనే… మేడిగడ్డనకు రిపేర్లు చేయించండి.. వర్షాకాలంలో వరదలు వచ్చే సరికి రిపేర్లు చేయించకపోతే.. బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు.
అయితే మేడిగడ్డ పగుళ్లు.. కాళేశ్వరం వైఫల్యాన్ని.. అవినీతిని ప్రజల ముందు పెట్టేందుకు కాంగ్రెస్కు ఇదో గట్టి అవకాశంగా కనిపిస్తోంది. కేంద్రంలోని నిపుణుల్ని పిలిపించి.. ముందుగా అసలు కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నారు. అసలు ఆ బ్యారేజీని ఎలా పునరుద్ధరిచాలన్నదానిపైనా ఇంకా నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ఆ బ్యారేజీని పగుళ్లు వచ్చినంత వరకూ తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని అంటున్నారు. వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మేడిగడ్డ కుంగకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టును ఓ అద్భుతమైన కట్టడంగా చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్ కు ఉండేది. కానీ ఆ ప్రాజెక్టు కుంగిపోవడం వల్ల మొత్తం కాళేశ్వరం కుంగిపోయిందన్నట్లుగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీంతో అసలు కాళేశ్వరం అంటే ఏమిటంటే అని బీఆర్ఎస్ నేతలు ప్రతీ చోటా క్లాస్ చెప్పాల్సి వస్తోంది. ఇది బీఆర్ఎస్కు ఇబ్బందికరమే. కళ్ల ముందు వేలకోట్లు పెట్టి కట్టినప్రాజెక్టు కుంగిపోవడాన్ని సమర్థించుకోవడం అంత తేలిక కాదు.