‘గని’, ‘గాంఢీవధారి అర్జున’… ఇలా వరుస ఫ్లాపులతో వరుణ్ తేజ్ కెరీర్ గాడి తప్పింది. శుక్రవారం విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ పరిస్థితీ ఇంతే. ఈ సినిమాకొచ్చిన బజ్, చేసిన ప్రమోషన్స్ ఎఫెక్ట్ కలక్షన్లలో కనిపించలేదు. `దేశభక్తి సినిమా` అనే సానుభూతి తప్ప, ఇంకేం సంపాదించలేకపోయింది. రివ్యూలు ‘బిలో యావరేజ్’ మార్కుల దగ్గరే ఆగిపోయాయి. వసూళ్ల పరిస్థితీ ఇంతే. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ‘మట్కా’పై పడబోతోంది. వరుణ్‌తేజ్, కరుణకుమార్ కాంబోలో ఈమధ్యే ‘మట్కా’ పట్టాలెక్కింది. ఈ సినిమాపై భారీ బడ్జెట్ కేటాయించారు. కొంతమేర షూటింగ్ జరిగింది. గ్లింప్స్ కూడా విడుదల చేశారు. బడ్జెట్ పరిధులు దాటడం వల్ల, ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారని ప్రచారం జరిగింది. `
‘ఆపరేషన్..’ ఇంటర్వ్యూలలో మాత్రం ”మట్కా సినిమా ఆగలేదు. కొంత గ్యాప్ వచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం” అని వరుణ్ ధీమాగా చెప్పాడు. ‘ఆపరేషన్’ హిట్టయితే ‘మట్కా’ విషయంలో ఎలాంటి అనుమానాలూ రేకెత్తేవి కావు. కానీ అనుకొన్న ఫలితం రాలేదు. దాంతో ఈ ఎఫెక్ట్ ‘మట్కా’పై పడడం దాదాపు ఖాయమే. సినిమా ఆగిపోవడం, నిర్మాతలు మారడం జరగవు కానీ, బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఆపరేషన్’ ప్లస్ పాయింట్ ఏమిటంటే, ఈ సినిమాకి ఓటీటీ, శాటిలైట్ రూపంలో మంచి డబ్బులు వచ్చాయి. దాంతో బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాకపోయినా నిర్మాత గట్టెక్కాడు. అయితే ప్రతీసారీ ఓటీటీలనే నమ్ముకోవడం కుదరని పని. కాబట్టి.. బడ్జెట్‌లో కోత తప్పదు. ఈ విషయమే దర్శక నిర్మాతలు ఇప్పుడు తలమునకలైపోతున్నారు. ‘మట్కా’ సెటప్ చాలా పెద్దది. భారీ సెట్లు అవసరం. దానికే చాలా ఖర్చు పెట్టాల్సివస్తుంది. బడ్జెట్ తగ్గిస్తే క్వాలిటీ ఏమైపోతుందే అనే భయం ఒకవైపు, పెరిగితే ఫైనాన్షియల్ గా సినిమా ఎటు పోతుందో అనే అనుమానం మరోవైపు.. వీటి మధ్య ‘మట్కా’ నలిగిపోతోంది. మరి దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.