ఏపీలో చిత్రమైన రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ రాజకీయాల్లో ఓ వర్గం మీడియా ఎప్పుడూ పావుగానే ఉంటుంది. ఢిల్లీలో వైఎస్ వివేకా కుమార్తె ప్రెస్ మీట్ పెడితే.. ఆ ప్రెస్ మీట్ కవరేజీ ఇవ్వడానికి చానళ్లకు ధైర్యం రాలేదు. కానీ వెంటనే .. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ రావడం లేదని ఓ ప్రచారం ప్రారంభించారు. శనివారం ఉదయం కూడా అదే చేశారు. దీంతో నారా లోకేష్ మీ ఏడుపే మా ఎదుగుదల అని.. సెటైరికల్ గా .. ఆ చానళ్ల స్క్రీన్ షాట్లు షేర్ చేసి వాత పెట్టారు.
నీలి , కూలి మీడియా బ్రేకింగ్ల వెనుక ఓ స్పష్టమైన పొలిటికల్ ఎజెండా ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. బీజేపీతో పొత్తుల చర్చలపై టీడీపీ, జనసేన ఇంత వరకూ బహిరంగం ఏమీ చెప్పలేదు. బీజేపీ కూడా కలుస్తుందని పవన్ కల్యాణ్ మాత్రం చెబుతున్నారు. చంద్రబాబు నోటి వెంట మాత్రం బీజేపీతో పొత్తు గురించి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా రాలేదు. లిస్ట్ ప్రకటించిన రోజు బీజేపీ పేరు ఎత్తకుండానే వారు కూడా వస్తామంటున్నారని వ్యాఖ్యానించారు.
అయితే టీడీపీ, జనసేనలో బీజేపీ చేరకూడదనేది వైసీపీ టార్గెట్. జనసేనను ఆపలేకపోయారు.. ఇప్పుడు బీజేపీని అయినా ఆపాలని గట్టిగా అనుకుంటున్నారు. బీజేపీ కూటమిలో చేరితే.. తర్వాత వచ్చే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కూడా భాగస్వామిగా ఉంటుంది. అప్పుడు తమకు రక్షణ ఉండదని అనుకుంటున్నారు. అందుకే బీజేపీతో లోపాయికారీ ఒప్పందానికి రెడీ అయిపోయారు. వీలైనంత వరకూ.. బీజేపీ.. ఆ కూటమిలో పోటీ చేయకూడదని.. ప్రచారాలు ప్రారంభించారు. వారికి ప్రో వైసీపీ బీజేపీ నేతల మద్దతు ఎలాగూ ఉంది. అయితే ఈ మీడియా ల ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది.