విశాఖలో ప్లోటింగ్ బ్రిడ్జి కథ ముగిసినట్లే కనిపిస్తోంది. మళ్లీ మళ్లీ కొట్టుకుపోతూండటంతో ఎలా ఆపరేట్ చేయాలో అర్థం కావడం లేదు. పది రోజుల కిందట వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తర్వాతి రోజే కొట్టుకుపోయింది. అది మాక్ డ్రిల్ అని కవర్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ పర్యాటకుల్ని అనుమతించలేదు. ఎందుకుంటే.. కొట్టుకుపోయిన భాగాన్ని తీసుకొచ్చి.. అతికించినా మళ్లీ మళ్లీ ఊడిపోతోంది. అసలు ఉండటం లేదు.
పది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై నుంచి నిపుణుల్ని రప్పించారు. వారు కూడా చేతులెత్తేశారు. అసలు ఆర్కే బీచ్లో అలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జి అనుకూలం కాదని మొదట నిపుణులు రిపోర్టులు ఇచ్చారు. అయినా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉండటం లేదని కిందా మీదా పడుతున్నారు. ఎన్నికలకు ముందు పరువు పోతోందని ఎలాగైనా కొన్నాళ్లైనా పర్యాటకుల్ని అనుమతించాలని అనుకుంటున్నారు. కానీ రిస్క్ చేస్తే… ఒక్క పర్యాటకుడు గల్లంతు అయినా జనం తిరగబడి దాడి చేస్తారు. పరిస్థితి అలాగే ఉండటంతో… ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
అసలు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి వెనుక చాలా పెద్ద అవినీతి కథ ఉందని చెబుతున్నారు. కేరళలో అరవై లక్షలకు ఏర్పాటు చేసిన ఈ తరహా బ్రిడ్జిని ఇక్కడ కోటిన్నరకుపైగా ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి వీఎంఆర్డీఏ కమిషనర్ పదే పదే తప్పుడు సమాచారాన్ని మీడియాకు ఇస్తున్నారు. ఆయనే బాధ్యుడు కాబట్టి.. నిండా ఇరుక్కుపోతాడన్న వాదన వినిపిస్తోంది.