జగన్ రెడ్డి వాడకం ఎలా ఉంటుందంటే.. పీల్చి పిప్పి చేసి ఇక పనికి రారు.. అవసరం లేదనుకునే వరకూ వాడతారు. తర్వాత నెత్తికి ఎక్కించుకుంటున్నామని చెప్పి పక్కన పెడతారు. తర్వాత ఎక్కడకు తొక్కేస్తారో అర్థం కాదు. రాయలసీమలో బలిజ నేతల పరిస్థితి ఇదే.
గత ఎన్నికల్లో బలిజల్ని టీడీపీ ప్రభుత్వంపై రెచ్చగొట్టగలిగారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులుకు టిక్కెట్లు కేటాయించారు. కానీ ఈ సారి వారిద్దరీ మొండిచేయి చూపించి రెడ్లకు టిక్కెట్లు ఇచ్చారు. రాయలసీమతో పాటు బలిజ ఓట్లు ఉంటే నెల్లూరు ప్రకాశంలోని మొత్తం 74 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు. నిజానికి రాజంపేట ఎంపీ టిక్కెట్ బలిజలకే కేటాయిస్తూ ఉంటారు. కానీ వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కేటాయిస్తోంది.
గ్రేటర్ రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు. గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు. ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికారపక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు.. తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కానీ వారి ఓట్లు మాకవసరం లేదన్నట్లుగా వైసీపీ పెద్దల తీరు ఉంది.