మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ను బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్ కు ఇచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ బీజేపీలో ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే.. ఈటలకు అందరూ వ్యతిరేకమే. బండి సంజయ్ .. కిషన్ రెడ్డి ఇలా అందరూ.. ఎవరికి వారు తమ సపోర్టర్లను ముందుకు నెట్టి .. హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారు. మురళీధర్ రావు నాలుగేళ్లుగా మల్కాజిగిరిలో పని చేసుకుంటున్నారు. చివరికి ఈటల రాజేందర్ వైపే హైకమాండ్ మొగ్గింది. దీనికి కారణం కూడా బీజేపీ వర్గాల్లో భిన్నంగా ప్రచారం జరుగుతోంది.
మల్కాజిగిరి టిక్కెట్ ను.. వీరందరితో పాటు .. ఓ విద్యాసంస్థల అధిపతి కూడా కోరుకున్నారు. ఆయన తెలంగాణ బీజేపీకి చెందిన ఓ ముఖ్యుడ్ని సంప్రదించారు. ఆయన భరోసా ఇచ్చి.. ప్రచారం చేసుకోవాలన్నారు. దీంతో ఆయన మల్కాజిగిరి వ్యాప్తంగా పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇలా ఆ ముఖ్యుడు ఊరకనే భరోసా ఇవ్వలేదు. ఆ తెలంగాణ విద్యా సంస్థల అధినేతకు ఇతర రాష్ట్రంలో ఉన్న భూమిని… ఆ ముఖ్యుడికి రిజిస్ట్రేషన్ చేశాడు. అందుకే టిక్కెట్ పై భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ నేత కూడా.. విద్యాసంస్థల అధినేతకే టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారంపై ముందే సమాచారం ఉండటంతో ప్రాథమికదశలోనే విద్యాసంస్థల అధినేత పేరును హైకమాండ్ కొట్టేసింది.
ఈ వ్యవహారం బయటకు రావడంతో… తెలంగాణ బీజేపీలో కలకలం రేగుతోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఆ ముఖ్య నేత ఎవరూ అన్న చర్చ జరుగుతోంది. చాలా కొద్ది మందికి ఆయన ఎవరో తెలుసని అంటున్నారు. బీజేపీలో కూడా ఇలా టిక్కెట్లకు ఆస్తుల్ని రాయించుకునే సంప్రదాయం వచ్చిందని.. అంతా తెలిసీ హైకమాండ్ ఊరుకోదని.. ఎన్నికలు అయ్యాక కఠిన చర్యలు తీసుకుంటుందని గట్టిగా నమ్ముతున్నారు.