బీఆర్ఎస్ అభ్యర్థులు .. బీజేపీ అభ్యర్థులుగా ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఇటీవల ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు. వారికి టిక్కెట్లు ఇచ్చేశారు. పోతుగంటి రాములు కుమారుడికి చాన్సిచ్చారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శానంపూడి సైది రెడ్డి ఎన్నారై. ఆయన బీఆర్ఎస్ మాజీ మంత్రి .. ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు సైదిరెడ్డి పార్టీ మారిపోతూండటంతో… అందరూ జగదీష్ రెడ్డి వైపు అనుమానంగా చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. దీంతో ఆపరరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల విషయంలో ఇనాక్టివ్ గా వ్యవహరిస్తూండటంతో… పక్క చూపులు చూసే నేతలు ఎక్కువగా ఉన్నారు.