అప్పులు చేయాలి కానీ ప్రభుత్వానికి పుట్టెడు తెలివి తేటలు. తమది కాదు కాబట్టి… అణాకాణీకి అయినా అస్తుల్ని అమ్మేయడమో.. తాకట్టు పెట్టడమో చేసి ఎన్నికలకు ముందు ఓటు బ్యాంక్‌కు డబ్బులు పంచడానికి అప్పులు తెస్తున్నారు. ఆర్బీఐ నుంచి లోన్లకు అనుమతి వస్తుందో రాదో క్లారిటీ లేకపోవడంతో… అప్పులిచ్చే ఓ ఏజెన్సీతో మాట్లాడుకుని.. ఏపీఎండీసీ ని తాకట్టు పెట్టేసి ఏడు వేల కోట్లు తెచ్చుకున్నారు. గుట్టుగా జరిగిపోయింది ఈ వ్యవహారం. ఇలా అప్పులు తెప్పించినందుకు 1.44 శాతం కమిషన్ కూడా ఇచ్చారు.
అంటే ఏపీఎండీసీ కింద ఆస్తులన్నీ అప్పుల కోసం తాకట్టు పెట్టేశారన్నమాట. ఇందు కోసం ప్రభుత్వం బేషరతుగా గ్యారంటీ ఇచ్చింది. అయితే ఇక్కడో మిస్టరీ ఉంది. అదేమిటంటే.. అసలు ఆ ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ఎవరు ఇచ్చారో ఎవరికీ తెలియదు. బాండ్లు తీసుకెళ్లిన ఏజెన్సీ.. అమ్మించి ఏడు వేల కోట్లు ఖాతాలో జమ చేయించి…కమిషన్ తీసుకుంది. వడ్డీ కూడా 8 శాతానికే.. అదీ కూడా రేటింగ్ లేని బాండ్లు. ఈ మిస్టరీ మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
అవినీతి సొమ్మును ఇలా ప్రభుత్వానికే .. అక్రమ మార్గాల్లో అప్పు రూపంలో ఇస్తున్నారా అన్నదే అసలైన అనుమానం. సీఆర్డీఏ బాండ్లను రూ. రెండు వేల కోట్లకు వేలం వేసినప్పుడు… ఎవరెవరు కొన్నారో లిస్టు బయటకు వచ్చింది. మందుబాబుల్ని తాకట్టు పెట్టినప్పుడు… కూడా ఎవరెవరో కొన్నారో తెలిసింది. మరి ఇప్పుడు కొన్న వారు ఎవరో ఎందుకు తెలియడం లేదు ?.