ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 22 నెలలుగా అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాల మధ్య జరుగుతున్న యుద్ధంలో నేడు మరో అంకం మొదలవబోతోంది. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందుకు, ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయినందుకు ప్రజలు దానిపై నమ్మకం కోల్పోయారని ఆరోపిస్తూ వైకాపా నేడు తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతోంది. గవర్నర్ ప్రసంగంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తరువాత అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తారు. ఒకవేళ ఏ కారణం చేతయినా ఈరోజు ఇవ్వలేకపోతే రేపు ఇస్తారని వైకాపా తెలియజేసింది.
శాసనసభలో ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని వైకాపా ప్రయత్నిస్తుంటే, మరోవైపు వైకాపాకి చెందిన సాక్షి మీడియాపై వేటు వేయడానికి తెదేపా కూడా పావులు కదపడం మొదలుపెట్టింది. మొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆ పత్రికపై పోలీసులకి పిర్యాదు చేయగా, నిన్న రాజధాని ప్రాంతంలో బేతపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, నవులూరు తదితర గ్రామాలకు చెందిన రైతులతో కలిసి స్థానిక తెదేపా నేతలు సాక్షి పత్రికపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తమ భూముల గురించి సాక్షి పత్రికలో ప్రచురితమవుతున్న అసత్య కధనాల వలన తమ గ్రామాలు రాజధాని ప్రాంతంలోనే ఉన్నప్పటికే అవి అభివృద్ధికి నోచుకొంటాయో లేదోననే తమకు చాలా భయాందోళనలు కలుగుతున్నాయని, కనుక తమకు మానసిక వేదన, నష్టం కలిగించే విధంగా అసత్య కధనాలు ప్రచిరిస్తున్న సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలని వారు తమ పిర్యాదులో కోరారు. తుళ్ళూరు మండలంలో పది గ్రామాల రైతులు కూడా నిన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో అటువంటిదే మరో పిర్యాదు చేసారు.
అదే విధంగా మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన కుమారుడు గురించి అసత్య కధనాలు ప్రచురిస్తునందుకు సాక్షి మీడియా, దానిని అందుకు ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలపై ఎస్సీఎస్టీ వేధింపుల చట్టం క్రింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవలసిందిగా అఖిల భారత దళిత, క్రైస్తవ సంఘాల సమాక్య జాతీయ ప్రధాన కార్యదర్శి జెరూసలేం మత్తయ్య రాష్ట్ర ఏసీ ఎస్టీ కమీషన్ కి సోమవారంనాడు పిర్యాదు చేసారు.