”ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన వుంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది’ ఇటివలే తన సినిమా విడుదల విషయంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అసలు ఒక సినిమా దర్శకుడికి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది ? మిగతా వారి సంగతి పక్కన పెడితే.. గౌతమ్ మీనన్ కి ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు వున్నాయి. ఆయన స్వయంకృత అపరాధాలు వున్నాయి.
ఒక కళ లేదా క్రియేటివ్ వర్క్ బిజినెస్ ఉంటేనే వెలుగులో వుంటుంది. సినిమా కూడా ఒక క్రియేటివ్ బిజినెస్. అందులో సందేహం లేదు. అయితే ఎప్పుడైతే కళాకారుడే బిజినెస్ మ్యాన్ గా మరిపోతాడో అక్కడ వస్తుంది చిక్కు. గౌతమ్ మీనన్ కూడా ఇలానే చిక్కులు తెచ్చుకున్నారు. 2001 నుంచి 2010 ఓ దశాబ్దం కాలం పాటు స్వర్ణయుగం చూశారు గౌతం. మిన్నలే నుంచి ఏం మాయ చేశావే వరకూ గౌతం తీసిన ప్రతి సినిమా చెప్పుకోదగ్గదే. ఒక దశాబ్దకాలంలో సినిమాని ఒక క్రియేటివ్ ఆర్ట్ ఫార్మ్ లానే చుశారాయన. కానీ తర్వాతే ఆయనలో బిజినెస్ మ్యాన్ తెరపైకి వచ్చాడు.
2011 – 2013 మధ్య దాదాపు 80 కోట్ల రుపాయిలని తమిళనాడు, ముంబైకి చెందిన ఫైనాన్షియర్ల దగ్గర ఋణంగా తీసుకొని, తన బ్రాండ్ తో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి పెద్ద స్థాయిలో బిజినెస్ చేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారాయన. ఈ ప్లాన్ లో భాగంగా చాలా ప్రయోగాలు చేశారు. ఒక కథని రెండు భాషల్లో ఏకకాలంలో తీసేలా చూడటం, హీరో బలం కాకుండా తన బ్రాండ్ నే హైలెట్ చేస్తూ ప్రచారం చేసుకునే ఎత్తుగడ వేశారు. ఈ ప్లాన్ లో వచ్చిన తొలి సినిమా ‘నడునిసి నాయ్గల్’ కి మంచి రివ్యూలు వచ్చాయి కానీ జనం చూడలేదు. ఇది గౌతమ్ కి తొలిదెబ్బ. ఈ సినిమాతో దాదాపు ఏడు కోట్లు నష్టపోయారు.
ఏ మాయ చేశావే కి హిందీ రిమేక్ చేయాలనని చూసిన ‘ఎక్ దివాన థ’ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ సినిమా గౌతమ్ ని ఆర్ధికంగా చాలా దెబ్బతీసింది. నానితో చేసిన ఏటో వెళ్ళిపోయింది మనసు గౌతంకు మరో డిజాస్టర్. ఈ సినిమాని నాని, జీవాతో కలసి ఏకకాలంలో తీయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. నిజంగా అది మంచి ప్రయోగమే.
కానీ ఈ ప్రయోగమే గౌతమ్ ని తర్వాత గట్టి దెబ్బకొట్టింది. లోకేషన్స్ కలిసొస్తాయని నాగచైతన్య, శింబు ఇద్దరి డేట్స్ తీసుకొని ఒకేసారి ‘సాహసం శ్వాసగా సాగిపో..’ అనే సినిమాని మొదలుపెట్టాడు. టైటిల్ లానే సినిమా కూడా చాలా కాలం సాగింది. ఈ సినిమాలో తీసుకున్న పుణ్యానికి శింబు చుక్కలు చూపించాడు. కోట్లలో అడ్వాన్స్ తీసుకొని షూటింగులకు రాకుండా తిప్పించాడు. వారి మధ్య ఈగో సమస్యలు సినిమాపై ప్రభావం చూపాయి. ఈ సినిమా కూడా డిజాస్టర్. టోటల్ గా నిర్మాతగా దారుణంగా ఫెయిలయ్యారు. అలా గౌతమ్ లోని క్రియేటర్ ఆర్ధిక సమస్యల్లో చిక్కుకొని విలవిలలాడాడు.
2011- 2020వరకూ గౌతం పని చేసిన ఏకైక స్టార్ హీరో అజిత్ (ఎంతవాడు కానీ). ఈ సినిమాకి నిర్మాత ఆయన కాదు. ఈ గ్రాఫ్ ని బట్టి గౌతమ్ మీనన్ అనుకున్న బిజినెస్ ప్లాన్ ని అర్ధం చేసుకోవచ్చు.
దురదృష్టం ఏమిటంటే.. ఇందులో ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు వద్ద క్లిక్ కాలేదు. ఎప్పుడైతే గౌతమ్ లో బిజినెస్ మ్యాన్ ఆవహించాడో అప్పుడే ఆయనలో క్రియేటర్ వెళ్లిపోయాడని ఆయనపై ఒక విమర్శ కూడా తమిళనాట బాహాటంగానే వినిపిస్తుంది.
విక్రమ్ తో ధ్రువ నక్షిత్రం అనే సినిమా చేశారు. ఇది కూడా ఐదేళ్ళ క్రితమే ఎప్పుడో పూర్తి చేసుకొని ఇప్పటికీ విడుదల కావడం లేదు. దీనికి కారణం కూడా ఆర్ధిక సమస్యలే. ఈ సినిమాని పూర్తి చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. పూర్తి స్థాయి నటుడిగా మారారు, చాలా సినిమాల్లో నటించాడు. ఆ డబ్బులో అందులో పెట్టారు. అయినప్పటికీ సమస్యలు తీరడం లేదు.
ఏదేమైనా గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడు ఇలాంటి ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కొవడం బాధకరమే. క్రియేటర్ ని బిజినెస్ మ్యాన్ డామినేట్ చేస్తే వచ్చే నష్టాలివి. మొత్తానికి గౌతంలోని బిజినెస్ మ్యాన్ చాలా మంది క్రియేటర్స్ కి ఓ గుణపాఠం.