సీఎం జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖ పేరుతో ఓ సదస్సు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖకు ఏం చేశామో.. ఏం చేయబోతున్నామో ఆయన చూసి చదివే అవకాశం ఉంది. అయితే ఆయన చెప్పేదేంటో అందరికీ తెలుసు.. కానీ కళ్ల ముందు కనిపిస్తున్నవి మాత్రం ఎప్పుడూ చెప్పరు. ఐదేళ్లలో విశాఖను పూర్తిగా నాకించేశారు. ఇండస్ట్రీస్ తరిమేశారు… ప్రకృతిని చెరబట్టారు.. ప్రైవేటు ఆస్తుల్ని దోచుకున్నారు. విశాఖలో అంతకు మించి జరిగిందేమీ లేదు.
ప్రశాంతమైన విశాఖ – బ్రాండ్ నేమ్ ఇప్పుడు ఉందా ?
ఐదేళ్ల కిందట విశాఖ అంటే.. ప్రశాంతమైన నగరం. ఇప్పుడు ఎవరైనా విశాఖ నగరాన్ని ప్రశాంతమైన నగరంగా పిలువగలరా ?. ఐదేళ్లలో జరగని దారుణాలు లేవు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. రౌడీమూకుల రెచ్చిపోతున్నాయి. విశాఖను రాజకీయ అలజడులకు కేంద్రంగా మార్చారు. చివరికి ఎంపీ కుటుంబసభ్యుల్ని కిడ్నాప్ చేసి రెండు రోజులు ఇంట్లో నిర్బంధించి డబ్బులు వసూలు చేస్తే.. పోలీసులువ్యవహరించిన తీరు చూసి.. అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరికీ రక్షణ లేని ఓ విశాఖను ప్రజల ముందు ఉంచారు.
ప్రైవేటు ఆస్తులకూ రక్షణ లేని దౌర్భాగ్యం !
ఇదిగో మీ వ్యాపారాల్లో మీ ఆస్తుల్లో లోపాలున్నాయి..కూల్చేస్తున్నామని.. ప్రతీ శుక్రవారం సాయంత్రం జేసీబీలతో విరుచుకుపడతారు. సగం కూల్చేస్తారు. తర్వాత ఆపేస్తారు. తర్వాత మళ్లీ అంతా యధావిధిగా సాగుతుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే… నోటీసులు ఇచ్చి… ఆస్తులు రాయించుకుంటారన్నమాట. ఇలా వందల ఎకరాలు.. ఆస్తులు చేతులు మారిపోయాయి. గత ఐదేళ్లలో ఎంత మంది వ్యాపారులకు… ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చిన తర్వాత వారి ఆస్తుల ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లిన తర్వాత నోటీసులు ఉపసంహరించారో బయటకు ప్రభుత్వం మారిన తర్వాత విచారణ చేస్తేనే వెలుగులోకి వస్తుంది. ఓ మాఫియా రాజ్యంగా విశాఖను మార్చారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ప్రకృతి విధ్వంసం
ఎవరూ అడగకపోయినా ఎగ్జిక్యూటివ్ పేరుతో చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. రుషికొండకు గుండు కొట్టేసి విలాసవంతమైన భవనాల్ని నిర్మించుకున్నారు. సీఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా … బీచ్ మొత్తాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారుత. గత ఐదేళ్లలో విశాఖకు ప్రభుత్వం చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఇప్పుడు విజన్ విశాఖ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పేందుకు ఎన్నికలకు ముందు రెడీ అయ్యారు.