బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నేతలు, సొంత నేతలపైనా నిఘా ఉండేదని అందరికీ తెలుసు. ఇంటలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్ కు ఓ ప్రత్యేకమైన విభాగం ఉండేదని.. చెబుతూంటారు. రేవంత్ రెడ్డి .. స్టీఫెన్సన్ సంభాషణలను రికార్డు చేయడం.. అవి బయటకు రావడం సంచలనం అయ్యాయి. పదేళ్ల పాటు సాగిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బయటకు లాగినట్లుగా కనిపిస్తోంది.
సోమవారం రాత్రి దుగ్యాల ప్రణీత్ రావు అనే డీఎస్పీని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈయన కేసీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకరని భావిస్తున్నారు. ఈ ప్రణీత్ రావు నేతృత్వంలోనే మొత్తం ట్యాపింగ్ స్కాం నడిచిందని చెబుతున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుండి అంతర్గతంగా విచారణ జరిపిన ప్రభుత్వం వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదికలు వెలుగులోకి రావడంతో… ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పట్లో
ఎస్ఐబీలో దుగ్యాల ప్రణీత్ రావుదే ఆధిపత్యం.
ఎస్ఐబీ పేరుతో ఉండే పవర్స్ ని మిస్ యూజ్ చేసినట్లుగా తేలడంతో… సస్పెండ్ చేశారు. ఆయనపై తదుపరి చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ప్రణీత్ రావు పని చేస్తున్నారు. ఈ వ్యవహారంలో త్వరలో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.