నగరి ఎమ్మెల్యే రోజాకు రోజు రోజుకు టిక్కెట్ కేటాయించే పరిస్థితి లేకుండా పోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నగరి పార్టీ నేతల్ని మచ్చిక చేసుకోవాల్సింది పోయి పార్టీకి సంబంధం లేని వాళ్లతో తిట్టిస్తూండటంతో ఆమెపై మరింతగా తిరుగుబాటు చేస్తున్నారు. సోమవారం ఆమె నగరిలో సమావేశం పెట్టి.. తన భర్త సెల్వమణితో అసంతృప్త నాయకులపై ఆరోపణలు చేయించారు. కుక్కల్లా మొరుగుతున్నారని ఆయన తమిళంలో తిట్టారు. వారికి రోజా చాలా మేలు చేసిందన్నారు. సెల్వమణి విమర్శలతో అసంతృప్త నేతలు మరింతగా మండిపడ్డారు.
నగరిలోని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి రోజాపై పైర్ అయ్యారు . ఈ ఐదుగురు ఐదు మండలాలకు వైసీపీ ఇంచార్జ్లు. అసలు సెల్వమణికి వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి.. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రోజా సోదరుల దోపిడికి అడ్డుగా ఉన్నామనే తమనే దూరం పెట్టారని వైసీపీ ఇంఛార్జులు ఆరోపిస్తున్నారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రోజాకు ఎట్టిపరిస్థితిలోనూ ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని..ముఖ్యమంత్రి సీఎం జగన్ ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని వేడుకున్నారు. రోజాకు సీటు ఇస్తే నగరి నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు వ్యతిరేకవర్గం. ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమె భర్తకు వైసీపీ పార్టీతో సంబంధమేంటిని ప్రశ్నించారు. సెల్వమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని.. అలాంటి వ్యక్తి మాకు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని నిలదీశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమని చెప్పుకొచ్చారు. సెల్వమణి విమర్శల తర్వాత రోజాకు .. పార్టీ క్యాడర్ మరంత దూరం అయింది.