ఏపీ శాసన సభ ఇవాళ మొదలు కాబోతోంది. లాంఛనంగా 5 వ తేదీని ప్రారంభం అయినప్పటికీ అసలైన చర్చోపర్చలన్నీ ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు చాల హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజధాని భూ దందా ల గురించి కొన్ని రోజులుగా సాక్షి దినపత్రిక ద్వారా వైకాపా వెలుగు లోకి తెచ్చిన అనేక అంశాలు ఇప్పుడు సభలో జరగ బోయే చర్చలను డిసైడ్ చేయనున్నాయి. అమరావతి పేరు మీద కొన్ని లక్షల రూపాయల అవినీతి కి పాల్పడ్డారు అని పదే పదే చాటుతూ చంద్రబాబు సర్కారు ను ఇరుకున పెట్టడం ఒక్కటే లక్ష్యంగా వైకాపా చెలరేగిపోతున్నది. అదే సమయంలో వైకాపా దాడులను తిప్పికొట్టడానికి అధికార టీడీపీ రకరకాల కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నది.
ఇక్కడ ఒక కీలమయిన విషయం ఏమిటంటే.. రెండు పార్టీ లలోను కాస్త నోరు వేసుకుని మీడియా ముందు మాట్లాడగలిగిన వారంతా ఇంతకు మించి తమ ప్రతిభ ను నిరూపించుకోవడానికి మరొక అవకాశమే దక్కదు అన్నట్లుగా చెలరేగిపోతూ ఉన్నారు. ప్రత్యర్థుల్ని కార్నర్ చేయడమూ, వారిని ఎడాపెడా తిట్టడమూ మాత్రమే కాదు. ముందు వారిని బజారు కీడ్చడం లక్ష్యంగా వీరి విమర్శలు సాగుతూ ఉండడం విశేషం. తమాషా ఏమిటంటే ఏ పార్టీ లోని ఏ ఒక్క నాయకుడు కూడా.. తాము పవిత్రులం అని చెప్పడం లేదు. ఎదుటివారు అపవిత్రులు అని చెప్పడానికి మాత్రమే ఉత్సాహం కనబరుస్తున్నారు.
టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడినట్లు వైకాపా ఆరోపించిందనే అనుకుందాం. చంద్రబాబు మాటలను బట్టి చూసినా అవును భూములు కొనుగోలు చేసారు అనే ఒప్పుకుంటున్నారు. కానీ ఇవాళ సభలో ఎదురు దాడులకు సిద్ధమవుతున్న తీరును గమనిస్తే భిన్నంగా కనిపిస్తుంది. వ్వైకాపా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ భూములు కొన్నారు, వారి పాత్ర ఎంత ఉన్నది.. గతంలో వైకాపా వాళ్ళు పాల్పడిన భూదందా లు ఏమిటి… అనేది ప్రస్తావించడమే ప్రధాన ఎజెండా గా టీడీపీ ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తుంది.
ప్రజలకు శోచనీయమైన విషయం ఏమిటంటే.. ఏ ఒక్క నాయకుడు కూడా తను మొత్తం నిజాయితీ గా చేశాను అందడం లేదు.. మీరు అవినీతి పరులు కదా అనే ఆరోపణ వినిపించగానే… మీరు కూడా అవినీతి పరులే కదా అనడం ద్వారా తప్పించుకోవాలని అనుకుంటున్నారు తప్ప , ‘నేను ప్రతి పని నిజాయితీ గానే’ చేశాను… ఎలాంటి విచారణ అయినా చేయించవచ్ఛు’ అని దమ్ముగా చెప్పగలిగిన వారు కనిపించడం లేదు. అందుకే ఈ రాజకీయ వివాదాల రావణ కాష్టం లో ఏ సంగతి ఒక పట్టాన ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు.