కన్నడ దర్శకుడు హర్ష ‘భీమా’తో తెలుగులో పరిచయమౌతున్నాడు. ఈ సినిమా కంటే ముందు కూడా తెలుగులో హర్ష పేరు బాగానే వినిపించింది. రవితేజ బెంగాల్ టైగర్ కి కొరియోగ్రఫీ చేశాడు హర్ష. ఆ పరిచయంతో రవితేజ కూడా హర్ష డైరెక్ట్ చేసిన ఓ సినిమాలో చిన్న క్యామియో చేశారు. రవితేజ, హర్ష కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశం వుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై తాజాగా హర్ష స్పందించాడు.
‘రవితేజతో మంచి అనుబంధం వుంది. నా ప్రతి సినిమా గురించి ఆయనతో చెప్తాను. అయితే ఇప్పటివరకూ మేము కలసి సినిమా చేసే ప్రతిపాదన రాలేదు. నేను ఆయనకి కథ చెప్పానని వార్తలు వచ్చాయి. అందులో కూడా నిజం లేదు. భీమా తర్వాత కొన్ని కథలు రెడీ చేసుకున్నా. కానీ అధికారికంగా ఇంకఏది ఫైనల్ కాలేదు’ అని క్లారిటీ ఇచ్చారు హర్ష. కమర్షియల్ హంగులతో పాటు ఫాంటసీ టచ్ వున్న భీమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.