వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను అన్నీ చేశానని చెప్పుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. పూర్తి కానీ.. పనులు జరగని.. కనీసం నీటి చెమ్మలేని ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తూ.. నేనే నేనే చేశానంటున్నారు. తాజాగా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేశారు. అసలు ప్రాజెక్టే ఓ రూపానికి రాలేదు. చంద్రబాబు హయాంలో వేగంగా జరుగుతున్న పనుల్ని తాను రాగానే రివర్స్ టెండర్లేసి మేఘాకు అప్పగించారు. అప్పట్నుంచి యంత్రాలతో చేయాల్సిన పనుల్ని మనుషులతో చేయిస్తున్నారు.
ఇంకా రూ. నాలుగు వేల కోట్లకుపైగా విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా .. సొరంగం ద్వారా కానీ ఒక్క లీటర్ నీళ్లు పంపింగ్ చేసే పరిస్థితి లేదు. అయినా ప్రాజెక్టు ప్రారంభించేసి గొప్పలు చెప్పుకున్నారు. తన తండ్రి శంకుస్థాపన చేస్తే తాను ప్రారంభించానన్నారు. కానీ మొదట దీనికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు. ఆ తర్వాత పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. పూర్తి చేయలేదు. మళ్లీ చంద్రబాబు వచ్చాక పనులు పరుగులు పెట్టాయి. కానీ ఆయన ఓడిపోయాక.. జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొంత పని కూడాపూర్తి చేయలేదు. కానీ ప్రారంభించేశారు.
గుండ్ల కమ్మ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోతే.. పెట్టించడం చేతకాలేదు. ఈ కారణంగా కొన్ని వేల మంది రైతులు నష్టపోయారు. అయినా పట్టించుకోలేదు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే..టెండర్లు పిలిచి.. అస్మదీయుడికి అడ్వాన్సులు ఇచ్చారేమో కానీ.. పనులు మాత్రం ప్రారంభంకాలేదు. ఇలా చెప్పుకుటూ పోతే.. ఇరిగేషన్ డిపార్టుమెంట్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం నిలువెత్తునా కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేసి .. ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు.