బీఆర్ఎస్కు పరిస్థితులు కలసి రావడం లేదు. ఆ పార్టీలో ఉంటున్న నేతలు ఏ కారణం దొరకుతుందా అని వెదుక్కుని పక్క పార్టలకు వెళ్లిపోతున్నారు. తాజాగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నారంటూ ఆదిలాబాద్ నేతలు గుడ్ బై చెపుబుతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. కోనేరు కోనప్ప పై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ పోటీ చేశారు. ఆయన భారీగా ఓట్లు చీల్చడంతో కోనప్ప ఓటమి పాలయ్యారు.
బీఎస్పీ పొత్తు విషయంలో కేసీఆర్ నిర్ణయంపై మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో వారు బీఆర్ఎస్ గూటికి చేరగా పొత్తు వ్యవహారంలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీఎస్పీతో పొత్తు వ్యవహారం నచ్చక మరికొంత మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబితే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ డ్యామేజీ తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. బీఎస్పీతో పొత్తు కారణంగా ఎంత లాభం జరుగుతుందో కానీ అంత కన్నా ఎక్కువగా నష్టం జరుగుతుందన్న ఆందోళన .. బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది.