పాలమూరు ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఆయన యాక్టివ్ గా లేకపోయినా.. పోటీకి పెద్దగా ఆసక్తి చూపకపోయినా మళ్లీ ఆయనే పోటీ చేస్తారని ప్రకటించారు. నిజానికి మన్నె శ్రీనివాసరెడ్డి ఎంపీ అయినా ఆయన తరపున రాజకీయం చేసింది మన్నె జీవన్ రెడ్డి. ఆయన సోదరుడి కుమారుడు. ఇప్పుడా జీవన్ రెడ్డిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించేశారు రేవంత్ రెడ్డి.
ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ అయిన మన్నె జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్ టౌన్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ‘‘మీరు జీవన్‌రెడ్డిని గెలిపిస్తే.. రాష్ట్రానికి, జిల్లాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఆయన మంజూరు చేయిస్తారు” అని సీఎం హామీ ఇచ్చారు.
2021 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పా ర్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. మొత్తం ఓట్లు 1445 ఉంటే బీఆర్ఎస్ తరపున పార్టీ బీ ఫారం మీద గెలిచింది 1006 మంది ఉన్నారు. వివిధ కారణాల చేత అనర్హత వేటు, మరణించిన వారు పోగా 850 పై చిలుకు ప్రజాప్రతినిధులు బీఅర్ఎస్ పార్టీ వారు ఉన్నారు. అందరూ బీఆర్ఎస్ కు ఓటేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అందుకే బీఆర్ఎస్ పోటీ పెడుతుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.