అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు అసలు పొత్తులు అవసరం లేదని.. ప్రజలతోనే పొత్తులు ఉంటాయని కేటీఆర్ గర్వంగా చెప్పేవారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి… తెలంగాణలో కనీస బలం లేని బీఎస్పీతో పొత్తుకు రెడీ అయిపోయారు. కొన్ని సీట్లను ఇస్తామని స్వయంగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మహారాష్ట్రలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి… తెలంగాణ, మహారాష్ట్రలో కలిసి 50 స్థానాలు గెల్చుకుని కింగ్ మేకర్ అవుతామని కేసీఆర్, కేటీఆర్ చెప్పేవారు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లోనూ పోటీ చేయలేని పరిస్థితి.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడపైనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆరెస్ మాజీ ఎమ్మెల్యేలు, సిటింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు ఆ రెండు పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైతే నిత్యం బీఆరెస్‌ను వీడుతూనే ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ ఒకటి రెండు సీట్లకే పరిమితమైనా.. ఒక్క సీటు గెలవకపోయినా ఆ పార్టీ మరింత సంక్షోభంలో పడవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడు రానున్న రోజులలో స్థానిక సంస్థలలో బీఆరెస్ నుంచి మరింతగా వలసలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ను బతికించడం తమ పని కాదని బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. దీంతో బీఎస్పీతో పొత్తు తెరపైకి వచ్చింది. బీఆరెస్, బీఎస్పీ మధ్య పొత్తును తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇటీవలీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు దూరమైన ఎస్సీ, ఎస్టీలు ఎంత మేరకు స్వాగితిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆరెస్‌ను వ్యతిరేకించిన ఆ వర్గం ఓటర్లలో ఆరెస్పీ పట్ల సానుకూలతతో యువత కొంత మేరకు బీఎస్పీకి ఓటు వేసినా ఆ వర్గాల సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వారు అప్పుడే బీఆర్ఎస్ కు ఓటు వేసే పరిస్థితి ఉండదు.
ఎలా చూసినా బీఆర్ఎస్ చీఫ్ రాజకీయం తేలిపోతుంది. ఇప్పుడు బీఎస్పీకి ఇచ్చే సీట్ల నుంచి బీఆర్ఎస్ రేసు నుంచి వైదొలినట్లవుతుంది. అంటే గ్రౌండ్ ను బీజేపీ, కాంగ్రెస్ కు వదిలేసినట్లే. ఇది బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరం కానుంది.