కోర్టు డబ్బులూ కొట్టేశారు. ఇదేందయ్యా అంటే… పరిపాలనపరమైన సమస్యలు అని చెబుతున్నారు. కాస్త విచిత్రంగా ఉన్నా .. పరిపాలకుడు బుద్ది అలాంటిది అని నేరుగా చెప్పినట్లు అయింది. వినడానికే వింతగా… చేసిన వాళ్ల బుద్ది గురించి రోతగా అనిపించే ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.
విజయవాడలో కోర్టు భవనాల నిర్మాణానికి కేంద్రం రూ. 45 కోట్లు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఆ నిర్మాణాలు పూర్తి కావడం లేదు. దానిపై ఏపీ హైకోర్టులో కొంత మంది పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఎందుకు ఆలస్యమవుతున్నారని ఆరా తీసింది. తీరా చూస్తే .. కోర్టు భవనాల నిర్మాణం కోసం.. ప్రత్యేక ఖాతాలో ఉండాల్సిన నిధులు లేవు. ఎందుకని కోర్టు ప్రశ్నించింది.
కేంద్రం ఇచ్చిన డబ్బులతో పాటు రాష్ట్రం మరో రూ. 30 కోట్లు తన వాటాగా జమ చేయాల్సి ఉంది. ఇక్కడ కేంద్రం ఇచ్చిన రూ.45 కోట్లనూ లాగేసుకున్నారు. రాష్ట్రం ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. దీంతో పనులు జరగలేదు. అడ్వకేట్ జనరల్ ను కోర్టు నిలదీయడంతో… ఆయన పరిపాలనపరమైన సమస్యలు అంటూ వాదించే ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు వెంటనే హైకోర్టు ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని.. రాష్ట్రం వాటా నిధులు మాత్రం మరో పదిహేను రోజుల్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు.
అయితే కేంద్రం తరపు న్యాయవాది .. కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర వాటాను జమ చేసిన తర్వాతే వాడుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో వచ్చే వారానికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. ఆ లోపు డబ్బులు ఖాతాలో వేయాల్సిందేనని ఏజీకి స్పష్టం చేశారు. ఈ కేసు న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఏం హాలత్ అయిపోయిందని.. సెటైర్లు వేసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీరు లాఫింగ్ స్టాక్ అయిపోయింది.