ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల్లో డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు. ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ దుకాణాల్లో మొదటి మూడేళ్లు డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు. ఆ తరువాత మధ్యలో ఒక ఆరు నెలలపాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. అక్కడక్కడ కొన్ని షాపుల్లో మాత్రమే ఈ లావాదేవీలు జరిగాయి. రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ పూర్తిగా ఆగిపోయాయి.
చిన్న చిన్న వ్యాపారాల్లో సహితం ఆన్లైన్ పేమెంట్స్‌ని అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించే వారున్నారని, వారంతా రోజుకి రూ. 200 కనీసంగా ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా రూ. 50వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ అందులో సగమే అధికారికంగా జమ చేస్తూ, పెద్ద మొత్తంలో అవినీతికి ప్రభుత్వం పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు రూ. 50 కోట్లు మద్యం ద్వారా వస్తుంటే ప్రస్తుతం అది రోజుకు రూ. 80 కోట్ల వరకు వెళ్లింది. వినియోదారుడు అడిగిన బ్రాండ్స్ షాపుల్లో ఇవ్వడం లేదు. షాపు వారు చెప్పినవే తీసుకోవాలి. లేదంటే వెనుదిరగాల్సిందే. దుకాణాల వద్ద 116 రకాల బ్రాండ్స్ పేర్లు బోర్డులపై డిస్ప్లే చేశారు. కానీ షాపుల్లో ఉండేది కేవలం నాలుగైదు బ్రాండ్స్ మాత్రమే. డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ కంపెనీ వారు యాప్ తయారు చేశారు. ఆ యాప్ పనిచేయడం లేదు.
డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంత డబ్బుకు మాత్రమే లెక్కలు చెప్పి మరికొంత డబ్బుకు లెక్కలు చెప్పకుండా దాట వేస్తున్నారని, దాని వల్ల జీఎస్టీ ఎగ్గొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఈడీకి ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సీక్రెట్‌గా ఇప్పటికే ఏపీ మద్యం వ్యాపారానికి సంబంధించి… లెక్కలన్నీ ఈడీ రెడీ చేసిందని.. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.